సంగారెడ్డి: భార్యాభర్తల మధ్య మాటా మాటా పెరిగి మొదలైన చిన్న గొడవ ఇద్దరి ప్రాణాలను బలితీసుకున్న విషాద సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. క్షణికావేశంలో భార్య నిప్పంటించుకుని ఆత్మహత్యకు ప్రయత్నించగా ఆమెను కాపాడబోయి భర్త కూడా అగ్గికి ఆహుతయ్యాడు. ఇలా సంక్రాంతి పండగపూట భార్యాభర్తల మృతి ఆ కుటుంబంలోనే కాదు గ్రామంలోనూ విషాదాన్ని నింపింది.

ఈ విషాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా పుల్కల్‌ మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన చాకలి ఎల్లేశ్‌(42), సునీత(32)లు దంపతులు. గత కొంతకాలంగా ఎల్లేశ్‌ మద్యానికి బానిసవడంతో తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి. ఇలా బుధవారం రాత్రి కూడా భార్యాభర్తలిద్దరు గొడవపడ్డారు. మద్యం మత్తులో వున్న భర్తతో తీవ్ర వాగ్వాదం జరగడంతో సునీత మనస్తాపానికి గురయ్యింది. 

ఈ క్షణికావేశంలో దారుణ నిర్ణయం తీసుకుంది. పండగ పూట ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకుంది. భార్య ఒంటికి అంటుకున్న మంటలను ఆర్పి కాపాడేందుకు ప్రయత్నించిన భర్త ఎల్లేశ్‌ కూడా మంటల్లో చిక్కుకున్నాడు. తల్లిదండ్రులిద్దరు మంటల్లో చిక్కుకోవడాన్ని గమనించిన కూతురు హారిక కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి మంటలను ఆర్పారు. 

బాధితులిద్దరినీ సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించే క్రమంలో మార్గమధ్యలో సునీత ప్రాణాలు కోల్పోయింది. విషమ పరిస్థితుల్లో ఉన్న ఎల్లేశ్‌ను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు కూడా మృతి చెందాడు.