భార్య కళ్లెదుటే.. ఆమె భర్త ప్రాణాలు కోల్పోయాడు. ఈత కొడదామని నీటిలోకి దిగి.. ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర సంఘటన సూర్యాపేట జిల్లాలో  చోటుచేసుకుంది. 

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా కేంద్రానికి చెందిన పులిరాజుల నర్సింహారావు(42) ప్రైవేటు ఉద్యోగిగా జీవనం సాగిస్తున్నాడు. అతడి అన్న కుమారుడు నీరజ్(23), ఇతర కుటుంబసభ్యులతో కలిసి సూర్యాపేట జిల్లా నామవారం గ్రామంలోని బంధువుల ఇంటికి వచ్చారు. దశదిన కర్మ లో పాల్గొనేందుకు ఈ నెల 12న వారు వచ్చారు.

శనివారం సాయంత్రం కార్యక్రమం ముగిసింది. ఆదివారం నర్సింహారావు, నీరజ్ లు ఇతర కుటుంబసభ్యులతో కలిసి ఈత కొట్టడానికి గ్రామ శివారులోని చెరువు వద్దకు వచ్చారు. చెరువులోకి దిగగానే.. లోతు ఎక్కువగా ఉండటంతో నీట మునిగిపోయారు. కాపాడేందుకు ఇతర కుటుంబసభ్యులు ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. నర్సింహులు, నీరజ్ లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

తన కళ్ల ఎదుటే భర్త ప్రాణాలు కోల్పోవడం చూసి నర్సింహులు భార్య తట్టుకోలేక పోయింది. భర్తను కాపాడేందుకు తన ఒంటిపై ఉన్న చీరను కూడా విసిరింది. అయినా అందుకోలేకపోయాడు. దీంతో.. ఆమె గుండెలు అవిసేలా రోధించింది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందడం గ్రామంలో అందరినీ కలచివేసింది.