అతనికి భార్య, బిడ్డలే లోకం. వాళ్లంటే ప్రాణంగా జీవిస్తున్నాడు. అలాంటి వ్యక్తికి సడెన్ గా భార్య దూరమైంది. నిద్రలోనే భార్య అనారోగ్యంతో కన్నుమూసింది. దానిని  అతను తట్టుకోలేకపోయాడు. క్షణికావేశంలో బిడ్డలు ఏమైపోతారన్న ధ్యాస కూడా లేకుండా.. భవనం పై నుంచికిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన పంజాగుట్టలో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం బగదలకు చెందిన నాగేశ్వరరావు(37), రోజా (29) దంపతులు ఆరేళ్ల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్ నగరానికి వచ్చారు. భవన నిర్మాణ కార్మికులుగా పని చేస్తున్నారు. వీరికి అచ్యుత్‌(9), భరత్‌(6) ఇద్దరు కుమారులు. 

సోమాజిగూడ బీఎస్‌ మక్తాలో ఓ భవనం పైఅంతస్తులో నివాసముంటున్నారు. ఎప్పట్లానే సోమవారం రాత్రి నలుగురూ నిద్రించారు. తెల్లవారుజామున 4.30గంటల ప్రాంతంలో రోజా శరీరంలో ఎలాంటి కదలికలు కనిపించలేదు. అనారోగ్యం కారణంగా భార్య నిద్రలోనే కన్నుమూసింది. ఆమె మరణంతో ఆందోళనకు గురైన భర్త భవనంపై నుంచి కిందకు దూకాడు. కాగా.. తల్లిదండ్రులు ఇరువురూ మృతి చెందటంలో చిన్నారులు అనాథలయ్యారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.