మద్యంమత్తులో విచక్షణ కోల్పోయిన ఓ తాగుబోతు కట్టుకున్న భార్యపై హత్యాయత్నానికి పాల్పడిన దాారుణం జయశంకర్ భూపాలపల్లి జల్లాలో చోటుచేసుకుంది. 

భూపాలపల్లి: భూపాలపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నిత్యం భార్యను వేధిస్తున్న ఓ తాగుబోతు భర్త తాజాగా మరింత కిరాతకంగా ప్రవర్తించాడు. మద్యంమత్తులో విచక్షణ కోల్పోయి భార్యపై దాడిచేయడంంతో ఆమె ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిపోయింది. ఈ దుర్ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే... భూపాలపల్లి పట్టణంలోని రాంనగర్ కు చెందిన రాజ్యలక్ష్మి - రమేష్ భార్యాభర్తలు. మొదలు భార్య దూరమవడంతో రాజ్యలక్ష్మిని రెండో పెళ్ళి చేసుకున్నాడు రమేష్. అయితే మద్యానికి బానిసైన రమేష్ నిత్యం మద్యంసేవించి ఇంటికి వచ్చి భార్యతో గొడవపడేవాడు. ఇలా భర్త వేధిస్తున్నా పుట్టింట్లో పరిస్థితి కూడా బాగాలేకపోవడంతో ఆమె అలాగే భరిస్తూ వచ్చింది. 

ఎంత వేధించినా భార్య రాజ్యలక్ష్మి మౌనంగా భరించడాన్ని రమేష్ అదునుగా తీసుకున్నాడు. దీంతో మద్యంమత్తులో కేవలం గొడవకు దిగడమే కాదు శారీరకంగా హింసించడం ప్రారంభించారు. ఇలా తాజాగా పీకలదాక తాగి ఇంటికి వచ్చిన రమేష్ భార్యను చితకబాదాడు. విచక్షణ కోల్పోయి గొడ్డును బాదినట్లు బాదడంతో రాజ్యలక్ష్మికి తీవ్రగాయాలయ్యాయి. రక్తపు మడుగులో ప్రాణాపాయ స్థితిలో పడివున్న భార్యను అలాగే ఇంట్లో వదిలి బయటకు వెళ్లిపోయాడు. 

ఆమెను గమనించిన ఇంటిచుట్టుపక్కలవారు పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీంతో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అపస్మారకస్థితిలో పడివున్న రాజ్యలక్ష్మిని హాస్పిటల్ కు తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా వున్నట్లు డాక్టర్లు తెలిపారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిత్యం మద్యం సేవించి రాజ్యలక్ష్మిని రమేష్ వేధిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం అతడు పరారీలో వుండటంతో పోలీసులు గాలిస్తున్నారు.