చికెన్ వండమంటే వండలేదని భార్య నిద్రిస్తున్న సమయంలో గొడ్డలితో దాడి చేశాడో భర్త. దీంతో ఆ భార్య అక్కడికక్కడే మృతి చెందింది.
మంచిర్యాల : తెలంగాణలోని మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామంలో దారుణ ఘటన వెలుగు చూసింది. నచ్చిన కూర వండమంటే వండలేదని ఓ భర్త కిరాతకానికి ఒడిగెట్టాడు. భార్యను గొడ్డలితో నరికి హత్య చేశాడు. రాత్రికి చికెన్ కూర వండాలని చెబితే.. వంకాయ కూర వండిందని కోపానికి వచ్చిన ఆ భర్త… గొడ్డలితో భార్య మీద దాడి చేసి హత్య చేశాడు.
నిద్రిస్తున్న సమయంలో దాడి చేయడంతో గాలిపెల్లి శంకరమ్మ (45) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. భార్యను చంపిన భర్త గాలిపెల్లి పోశం (50) అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం వెలుగు చూడడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.
బొత్స మాటల వెనక జగన్ లేకుంటే వెంటనే బర్తరఫ్ చేయండి.. : తెలంగాణ మంత్రి గంగుల
చిన్నచిన్న కారణాలకే హత్యల దాకా వెళుతున్న ఘటనలు ఇటీవలి కాలంలో ఎక్కువవుతున్నాయని పోలీసులు అంటున్నారు. మాటలతో పోయేదానికి గొడ్డలి దాకా తెచ్చుకుంటున్నారని, కోపతాపాలను కాస్త అదుపులో పెట్టుకోవాలని… భార్యాభర్తల మధ్య గొడవలు మామూలే కానీ.. ఇలా నరక్కోవడం వరకు రాకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.
ఇదిలా ఉండగా, మార్చిలో ఇలాంటి ఘటనే ఏపీలోని ఒంగోలులో వెలుగు చూసింది. క్షణికావేశం నిండు కుటుంబాన్ని ఒక్క రాత్రిలో తలకిందులాగా చేసింది. భార్యాభర్తల మధ్య ఏర్పడిన కలహాలు.. తద్వారా క్షణికావేశం ఇద్దరు చిన్నారులను అనాధలుగా మార్చేసింది. డాకా అంజిరెడ్డి (42), పూర్ణిమ (39) దంపతులు. వీరిద్దరూ ఒంగోలు నగరంలోని విరాట్ నగర్ లో నివసిస్తున్నారు. ఇంటి దగ్గరే అంజిరెడ్డి కిరాణా దుకాణం నడుపుతున్నాడు. కాగా పూర్ణిమ ఆర్పీగా పనిచేస్తుంది.
తరచుగా ఏదో విషయంలో భార్యాభర్తలిద్దరికీ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే ఆ రోజు రాత్రి కూడా ఇద్దరి మధ్య వివాదం జరిగింది. ఇద్దరి మధ్య మాట మాటా పెరిగింది. తన మాటకే ఎదురు చెబుతుందా అని అంజిరెడ్డి క్షణికావేశానికి గురయ్యాడు. వెంటనే పక్కనే ఉన్న చపాతి కర్రను తీసుకొని భార్య తల మీద గట్టిగా ఒకటి వేశాడు. ఆ దెబ్బకు భార్య తలకి తీవ్ర గాయమై రక్తస్రావం అధికంగా కాసాగింది.. ఆ రక్తాన్ని చూసిన అంజిరెడ్డి భయంతో అక్కడి నుంచి పారిపోయాడు.
ఇది గమనించిన పిల్లలు బంధువుల సహాయంతో పూర్ణిమను ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే పూర్ణిమ మరణించినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు. భార్యను చపాతీ కర్రతో కొట్టి ఆమె చావుకు కారణమైన అంజిరెడ్డి అక్కడి నుంచి పారిపోయి.. కొత్తపట్నం సముద్రంలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్ణిమ మృతి కేసులో అంజిరెడ్డిని వెతుకుతున్న పోలీసులకు తెల్లవారి ఉదయం కే పల్లెపాలెం తీర ప్రాంతం వద్ద ఆయన మృతదేహం దొరికింది.
