ప్రియుడితో వెళ్లిపోయిన భార్యను దక్కించుకునేందుకు భర్త ఘాతుకానికి తెగబడ్డాడు. ఆమె ముక్కు కోయాలని యత్నించి కటకటాల పాలయ్యాడు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో ఈ ఘటన కలకలం రేపింది.
భార్య, ఆమె ప్రియుడిపై భర్త కత్తితో దాడి చేసిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా (mahabubnagar district ) జడ్చర్లలో (jadcherla) కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. హన్వాడ మండల దాచన్‌పల్లికి చెందిన సంజన్న, శిరీష భార్యాభర్తలు. వీరికి ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. పెయింటర్‌గా పనిచేసే సంజన్న, తన భార్యతో హైదరాబాద్‌లో ఉంటున్న క్రమంలో హుజూర్‌నగర్‌కు చెందిన రాంబాబుతో శిరీషకు పరిచయమైంది. ఈ నేపథ్యంలోనే రాంబాబు, శిరీషలు ఒకరినొకరు ప్రేమించుకున్నారు.
ఈ నేపథ్యంలో ప్రియుడు రాంబాబు ద్వారా శిరీషకు నయంకాని వ్యాధి రావడంతో తన భర్తను దూరం పెడుతూ వచ్చింది. అయితే తనకు ఏమైనా జరిగితే భర్త పరిస్ధితి ఏంటని భావించిన ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. ఎట్టకేలకు విషయాన్ని భర్తకు వివరించి నెల రోజుల క్రితం మరొక యువతితో సంజన్నకు పెళ్లి జరిపించి పెద్దల సమక్షంలోనే విడిపోయారు. అయితే సంజన్నతో కేవలం వారం రోజులు మాత్రమే ఉన్న రెండో భార్య ఆయనను విడిచిపెట్టి వెళ్లిపోయింది. అటు మొదటి భార్య శిరీష ప్రియుడు రాంబాబుతో వెళ్లిపోయింది. దీంతో ఒంటరిగా మిగిలిపోయిన.. సంజన్న తన మొదటి భార్య శిరీషతోనే కలిసి ఉండాలని నిర్ణయించుకున్నాడు.
దీనిలో భాగంగా ఆమెకు ఫోన్ చేసి జడ్చర్లకు రావాలని అక్కడ ముగ్గురం కలిసి మాట్లాడుకుందామని పిలిపించాడు. ఈ క్రమంలో ప్రధాన రహదారిపై నుంచి భార్యను జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో సాయినగర్‌కు వెళ్లే రహదారిపైకి తీసుకువచ్చి.. ఆకస్మాత్తుగా తన వెంట తెచ్చుకున్న కత్తితో దాడి చేశాడు. అయితే వీరికి కొంచెం దూరంగా ఉన్న ప్రియుడు రాంబాబు.. సంజన్నను అడ్డుకునేందుకు ప్రయత్నించగా అతనిపై కూడా దాడికి దిగాడు.
వీరి పెనుగులాటను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం రక్తపు మడుగులో పడివున్న శిరీష, రాంబాబులను బాదేపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం నిందితుడు సంజన్నను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రెండో భార్య కూడా తనను విడిచి వెళ్లిపోవడంతో ఎలాగైనా తన మొదటి భార్య శిరీషను దక్కించుకోవడానికే సంజన్న ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు. కత్తితో ముక్కును కోసి అందవిహీనంగా తయారు చేస్తే తన భార్య తనకు దక్కుతుందని ప్లాన్ గీశాడు. అందుకు అనుగుణంగా కత్తిని వెంట తీసుకెళ్లాడు. అయితే కత్తితో దాడి చేస్తున్నాడని పసిగట్టిన శిరీష తప్పించుకునే ప్రయత్నం చేయడంతో తొడ, వీపు భాగాలపై పొడిచినట్లు పోలీసులు చెబుతున్నారు.
