ఖమ్మం జిల్లాలో ఇద్దరు భార్య భర్తలు గంటల వ్యవధిలోనే కన్నుమూశారు. హాస్పిటల్‌లో హార్ట్ ఎటాక్‌తో మరణించిన ఆమెను ఇంటికి తీసుకువచ్చారు. ఆమె మృతదేహాన్ని చూసిన భర్త.. అంతలోనే తుది శ్వాస విడిచాడు. 

హైదరాబాద్: ఏ సంబంధం లేని ఇద్దరు మనుషుల మధ్య పెళ్లి గాఢమైన అనుబంధం పెనవేస్తుంది. ఆ బంధం చివరి వరకు కొనసాగుతుంది. ఉఛ్వాస, నిశ్వాసల్లా ఒకే ఇంటిలో కలిసి జీవితాన్ని గడుపుతారు. బాధ్యతలు నెరవేరుస్తారు. చివరకు కాలగర్భంలో కలిసిపోతారు. భార్య భర్తల మధ్య పెళ్లైన తొలినాళ్లలోని అన్యోన్యత తుదకంటా కొనసాగించే దంపతులు చాలా అరుదుగా కనిపిస్తారు. తుది శ్వాస వరకు ప్రాణంగా ప్రేమించే దంపతుల కోవలోకే ఖమ్మం జిల్లాకు చెందిన ఈ ఇద్దరు దంపతులు వస్తారు. హాస్పిటల్‌లో అనారోగ్యంతో మరణించిన భార్య మృతదేహాన్ని ఇంటికి వచ్చాక చూసిన భర్త.. కన్నుమూశాడు. 

ఖమ్మం జిల్లా చంద్రుపట్ల గ్రామంలో రాయల యోహాను (112), రాయల మార్తమ్మ (96) జీవించారు. మార్తమ్మ కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడింది. ఆమెను హాస్పిటల్‌లో చేర్చారు. గుండె పోటుతో ఆమె హాస్పిటల్‌లోనే మరణించింది. ఈ విషయం తెలిసినప్పటి నుంచి భర్త యోహాను మనసు మనసులో లేదు. తల తెగిపోయినంతగా విలవిల్లాడాడు.

Also Read: సూర్యాపేటలో కేసీఆర్ టూర్: కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు ప్రారంభించిన సీఎం

మార్తమ్మ మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చారు. ఆమె డెడ్ బాడీని రాయల యోహాను చూడగానే.. గుండెలో బాధ పొంగిపోయింది. ఎంతలా అంటే.. గుండె కొట్టుకోవడమే ఆగిపోయింది. ఆ దంపతులు గంటల వ్యవధిలోనే మరణించడంతో గ్రామం విషాదంలో మునిగింది. గ్రామస్తులు కంటనీరు పెట్టారు. ఏడు దశాబ్దాల వారి దాంపత్యాన్ని చావు కూడా వేరు చేయలేకపోయిందని అనుకున్నారు.