నల్లగొండ: ఓ వ్యక్తి భార్యను చితకబాది గొంతు నులిమి చంపేసిన సంఘటన వెలుగు చూసింది. ఈ సంఘటన చౌటుప్పల్ మండలం లిగోజిగూడెంలో జరిగింది. మృతురాలి స్వస్థలం బీహార్ రాష్ట్రంలోని కాగారియా జిల్లా మరర్ (ఉత్తరి). 

ఆ ప్రాంతానకిి చెందిన సంగీతకుమారి (23), సింటుకుమార్ ఉపాధి కోసం కొంత కాలం కింద చౌటుప్పల్ వలస వచ్చారు. సింటుకుమార్ మొదట ఓ లేబర్ కాంట్రాక్టర్ సాయంతో స్థానికంగా ఉన్న ఓ పరిశ్రమలో కూలీగా పనిచేశాడు. పరిశ్రమ వెనక భాగంలోని ఓ గుడిసెలో నివాసం ఉండేవారు. 

Also Read: అనుమానం.. తాగిన మత్తు.. భార్యను చంపిన భర్త

ఇటీవల అతను అక్కడ పని మానేసి లింగోజిగూడెం స్టేజీ వద్ద ఓ గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. శ్రీ ఐశ్వర్య రిపైనరీఆయిల్ మిల్ లో పనిచేసేందుకు కుదిరాడు. గురువారం ఉదయం పనికి వెళ్లాల్సి ఉంటగా ఎంతకీ రాకపోవడంతో కాంట్రాక్టర్ సింటుకుమార్ కు ఫోన్ చేశాడు. అతను ఫోన్ ఎత్తకపోవడంతో ఓ వ్యక్తిని ఇంటికి పంపించాడు. దాంతో సంగీత కుమారి హత్యకు గురైన విషయం వెలుగులోకి వచ్చింది.

కాంట్రాక్టర్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. భర్త కనిపించకపోవడంతో అతనే సంగీత కుమారిని చంపి ఉంటాడని అనుమానిస్తున్నారు. 

Also Read: బాలీవుడ్ హీరోపై మోజు... అసూయతో భార్యను చంపిన భర్త

మృతురాలికి మూడేళ్ల కూతురు ఉంది. కూతురిని తీసుకుని సింటుకుమార్ పారిపోయాడు. భార్యపై అనుమానంతో, గొడవల కారణంగా సింటు కుమార్ ఈ హత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. సింటు కుమార్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.