Asianet News TeluguAsianet News Telugu

చిన్నారులను కొని.. పెంచిన తరువాత వ్యభిచార రొంపిలోకి దింపి.. యాదగిరిగుట్టలో దారుణం...

బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపిన ఇద్దరు అమ్మాయిలను యాదగిరిగుట్ట పోలీసులు రక్షించారు. చిన్నతనంలో కొని, వారిని ఈ రొంపిలోకి దింపినట్టు సమాచారం. 

human trafficking racket busted in yadadri bhuvanagiri district, minor girls rescued
Author
First Published Dec 7, 2022, 9:40 AM IST

యాదగిరిగుట్ట : కన్నబిడ్డ అయినా.. సాకిన బిడ్డ అయినా.. వారికి ఏ కాస్త కష్టం వచ్చినా ఆ తల్లి మనసు విలవిలలాడుతుంది. ఆ కష్టాన్నితీర్చడం కోసం ఎంతకైనా తెగిస్తుంది. అయితే, ఓ తల్లి మాత్రం చిన్నప్పటి నుంచి పెంచిపోషించిన తన ఇద్దరు కూతుళ్లను వ్యభిచార రొంపిలోకి  దింపాలని ప్రయత్నించింది.  కసాయి వాడు పశువుల్ని సాకినట్టుగా సాకి.. చివరికి వ్యభిచారానికి బలి ఇచ్చింది. ఈ దారుణమైన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ఓ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు మంగళవారం మీడియాకు వివరాలను వెల్లడించారు. 

యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని యాదగిరి పల్లికి చెందిన కంసాని అనసూయ ఈ కేసులో ప్రధాన నిందితురాలు. చాలా ఏళ్ళ క్రితం ఎవరి దగ్గరో ఇద్దరు ఆడ శిశువులను కొనుగోలు చేసింది. వారిని యుక్త వయసు వచ్చే వరకు పెంచి, పోషించింది. సులువుగా డబ్బులు సంపాదించుకోవాలని ఆశతో.. ఆ ఇద్దరు బాలికలతో వ్యభిచారం చేయించాలని ప్లాన్ వేసింది. దీనికోసం సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లికి చెందిన తన బంధువైన కంసాని శ్రీనివాస్ దగ్గరికి ఇద్దరు బాలికలను పంపించింది. ఆ బాలికలతో శ్రీనివాస్ సిరిసిల్లాలో బలవంతంగా వ్యభిచారం చేయిస్తూ ఉండేవాడు. 

జగిత్యాల నుండే టీఆర్ఎస్ జైత్రయాత్ర: కేసీఆర్ సభకు బయలుదేరిన కవిత

ఈ క్రమంలోనే యాదగిరిపల్లి కూడా ఆ బాలికలను పంపించేవాడు. దీనికి బాలికలు ఎదురుతిరిగితే అనసూయ వారిని విపరీతంగా కొట్టేది. వీరిద్దరికీ మరికొంతమంది కూడా సహకరించేవారు. ఈ చిత్ర హింసలు భరించలేక ఇద్దర్లో ఓ బాలిక ఇటీవల అక్కడినుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది. యాదగిరిగుట్ట నుంచి తప్పించుకుని జనగామ జిల్లా బస్టాండ్ లో తిరుగుతుంటే.. పోలీసులు ఆమెను గమనించారు. అనుమానాస్పదంగా అనిపించడంతో ఆమెను స్టేషన్కు తీసుకు వెళ్ళి విచారించగా.. యాదగిరి పల్లికి చెందిన అనసూయ, తంగళ్ళపల్లికి చెందిన శ్రీనివాస్ ఇద్దరు బాలికలతో వ్యభిచారం చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. 

దీంతో పోలీసులు యాదాద్రి భువనగిరి జిల్లా బాలల సంరక్షణ అధికారి సైదులు, యాదాద్రి పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు నెల 3న సైదులు పోలీసులకు దీని మీద ఫిర్యాదు చేశాడు. దీంతో యాదగిరిగుట్ట పోలీసులు, షీటీమ్స్, చైల్డ్ ప్రొటెక్షన్ సభ్యులు  పక్కా ప్లాన్ ప్రకారం యాదగిరిపల్లిలోని అనసూయ ఇంటిమీద దాడి చేశారు. ఆమెను అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో వ్యభిచార ముఠా గుట్టు బయటపడింది. అనసూయ ఇచ్చిన సమాచారంతో కరీంనగర్ జిల్లా రామడుగుకు చెందిన చల్లా భాస్కర్, చంద కార్తీక్, తంగళ్ళపల్లి కి చెందిన కంసాని శ్రీనివాస్, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని టీచర్స్ కాలనీకి చెందిన కంసాని లక్ష్మిలను పోలీసులు అరెస్టు చేశారు.

ఈ కేసులో  నిందితులుగా ఉన్న సిద్దిపేట్ జిల్లా హుస్నాబాద్ కు చెందిన కంసాని స్వప్న, కంసాని అశోక్, యాదగిరి పల్లికి చెందిన కంసాని ప్రవీణ్, కరీంనగర్ జిల్లా రామడుగు కు చెందిన చెందిన సరోజనమ్మ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బాధితులైన ఆ ఇద్దరు బాలికలను పోలీసులు బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. సీపీ మహేష్ భగవత్ దాడుల్లో పాల్గొన్న డి సి పి నారాయణ రెడ్డి,  ఏసీపీ  కోట్ల నరసింహారెడ్డి,  టౌన్ సీఐ సైదయ్య,  యాదగిరిగుట్ట పోలీసుల బృందానికి అభినందనలు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios