అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకున్న విధ్వంసంపై మానవ హక్కుల కమీషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై జూలై 20లోపు సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆర్పీఎఫ్, జీఆర్పీ డీజీలను శనివారం ఆదేశించింది 

త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా నిరుద్యోగులు, యువత ఆందోళనకు దిగుతున్నారు. దీనిలో భాగంగా శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ‌లో జరిగిన నిరసన కార్యక్రమం హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. పలు రైళ్లను తగులబెట్టిన ఆందోళనకారులు, రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారు. దీంతో అల్లర్లను అదుపు చేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు మరణించగా.. 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో యావత్ దేశం ఉలిక్కిపడింది. మరోవైపు సికింద్రాబాద్ విధ్వంసంపై మానవహక్కుల కమీషన్ స్పందించింది. మీడియాలో వచ్చిన కథనాలను సుమోటోగా తీసుకున్న హెచ్ఆర్సీ.. జూలై 20లోపు ఈ ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆర్పీఎఫ్, జీఆర్పీ డీజీలను శనివారం ఆదేశించింది. 

మరోవైపు... సికింద్రాబాద్ విధ్వంసం కేసులో అరెస్ట్ అయిన 52 మంది నిందితులకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో వీరందరినీ పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. అంతకుముందు వీరందరికి గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే (secunderabad railway station) అల్లర్లకు 15వ తేదీనే ఆందోళన కారులు స్కెచ్ వేసినట్లుగా ప్రముఖ తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది. జూన్ 15వ తేదీన కేంద్రం అగ్నిపథ్ ప్రకటనతో ఆందోళన చెందిన అభ్యర్ధులు .. నిరసనలకు ప్రణాళికలు రూపొందించారు. ముందుగా ఏఆర్వో కార్యాలయానికి వెళ్లాలనేది ఆందోళనకారుల ప్లాన్. ఆ తర్వాత రూట్ మార్చి సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో విధ్వంసానికి వ్యూహరచన చేశారు. హకీంపేట ఆర్మీ సోల్జర్స్‌తో పాటు ఇతర పేర్లతో వాట్సాప్‌లో గ్రూపులు క్రియేట్ చేసుకున్న యువకులు.. 15వ తేదీ నాటికి అందరూ సికింద్రాబాద్‌కు రావాలని నిర్ణయించుకున్నారు. 

అలాగే ప్రతి ఒక్కరూ పెట్రోల్ బాటిల్ తెచ్చుకోవాలని , స్టేషన్‌ను ఎక్కడికక్కడ బ్లాక్ చేద్దామంటూ వాయిస్ ఛాట్ చేసుకున్నారు. అంతేకాకుండా ఇందులో ఇప్పటికే అరెస్ట్ అయిన సాయి డిఫెన్స్ అకాడమీ (sai defence academy) డైరెక్టర్ సుబ్బారావు (avula subbarao) ప్రస్తావన కూడా ఆడియోల్లో స్పష్టంగా వుంది. పులి తెలంగాణలో అడుగుపెడుతోంది.. ఇక చూస్కోండి అంటూ వాయిస్ మెసేజ్ పెట్టారు యువకులు. ఆదిలాబాద్ నుంచి కృష్ణా ఎక్స్‌ప్రెస్‌కు రెండు బోగీల్లో యువకులు సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరుకోగా.. అటు గుంటూరు, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన వారు కూడా రైళ్లోనే నగరానికి చేరుకున్నారు. ఆందోళనలో పాల్గొన్న వారంతా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాసేవారే.