కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కిషన్ రెడ్డి సమావేశమయ్యారు.

కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ప్రధాని మోదీ నిజామాబాద్ పర్యటన, కొందరు పార్టీ నేతల అసంతృప్తి తదితర అంశాలపై ఇరువురు నేతల మధ్య చర్చలు జరిగినట్టుగా తెలుస్తోంది. అలాగే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై కూడా ఇరువురి మధ్య చర్చలు జరిగినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ముఖ్య నేతల అభ్యర్థితత్వంపై బీజేపీ అధినాయకత్వం ఒక క్లారిటీకి వచ్చినట్టుగా తెలుస్తోంది. బీజేపీ సీఈసీలో చర్చించిన తర్వాత.. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. 

రాష్ట్రంలోని కొందరు పార్టీ నేతల అసంతృప్తికి సంబంధించి కిషన్ రెడ్డి నుంచి అమిత్ షా వివరాలు సేకరించినట్టుగా తెలుస్తోంది. అలాగే మంగళవారం రోజు ప్రధాని మోదీ నిజామాబాద్ పర్యటనపై కూడా చర్చించినట్టుగా తెలుస్తోంది. తెలంగాణలో ఎన్నికల సమీపిస్తున్ననేపథ్యంలో.. మరిన్ని మోదీ సభలు పెట్టాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. కరీంనగర్, నిర్మల్‌లలో కూడా ప్రధాని మోదీ పర్యటించేలా ప్రణాళికలు రచిస్తున్నట్టుగా సమాచారం.

ఇదిలాఉంటే, ప్రధాని మోదీ ఆదివారం రోజున తెలంగాణలోని మహబూబ్ నగర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా రూ. 13,500 కోట్లు విలువ చేసే అభివృద్ది పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటుతో పాటు, ములుగు జిల్లాలో కేంద్రీయ గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్టుగా మోదీ ప్రకటించారు. తెలంగాణ అభిృద్దికి కేంద్రం కట్టుబడి ఉందని మోదీ స్పష్టం చేశారు. 

అనంతరం బీజేపీ సభలో పాల్గొన్నమోదీ.. తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని అన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీ రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. తెలంగాణ రైతులను రాష్ట్ర ప్రభుత్వం దోపీడీ చేస్తుందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర రైతులకు సాగు నీరు ఇవ్వడం లేదన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తామని లబ్దిపొందిన సర్కార్... ఆ తర్వాత రైతులను విస్మరించిందని ఆయన విమర్శించారు. రుణమాఫీ చేయని కారణంగా అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం లేకపోయినా రైతులను ఆదుకొన్నామని మోదీ తెలిపారు.