హైదరాబాద్: హైదరాబాదు సమీపంలోని పటాన్ చెరు పారిశ్రామికవాడలో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగకపోయినప్పటికీ భారీ ఆస్తి నష్టం మాత్రం జరిగింది. 

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పారిశ్రామికవాడలోని అగర్వాల్ రబ్బర్ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం జరిగింది. ప్రొడక్షన్ సెంటర్ లో మంటలు లేచాయి. టైర్లను తయారు చేసే కెమికల్ డ్రమ్ములకు మంటలు అంటుకోవడంతో ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉంది.

జనవరిలో ఇదే కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన కంపెనీ చైర్మన్ గుండెపోటుతో మరణించాడు. మంటల వల్ల కిలోమీటర్ మేర దట్టమైన పొగలు అలుముకున్నాయి. వాహనాల రాకపోకలకు కూడా అంతరాయం కలిగింది. 

ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే, ఐదు ఫైరింజన్లు మంటలను ఆర్పే పనిలో నిమగ్నమయ్యాయి. రబ్బర్ కాలుతుండడంతో మంటలను అదుపు చేయడదం కష్టంగా మారింది.