తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆ పార్టీ శ్రేణులు సిద్దమయ్యాయి. 

తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆ పార్టీ శ్రేణులు సిద్దమయ్యాయి. ఫిబ్రవరి 17న కేసీఆర్ 69వ పుట్టినరోజు పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించేలా బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. హైదరాబాద్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో కేసీఆర్ 69వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం నెక్లెస్‌ రోడ్డులోని థ్రిల్‌ సిటీలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. 

69 కేజీల కేక్‌ కట్ చేయడంతో పాటు కేసీఆర్ జీవితంలోని కీలక మైలురాళ్లను, గత ఎనిమిదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను తెలిపేలా 3డీ గ్రాఫిక్స్‌తో కూడిన డాక్యుమెంటరీని ప్రదర్శించున్నారు. కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా నగరంలోని ప్రధాన దేవాలయాలు, మసీదులు, చర్చిలలో ప్రార్థనలు నిర్వహించనున్నారు. అలాగే ముఖ్యమైన దేవాలయాలలో, చండీ యాగం, ఆయుష్ హోమం, రాజశ్యామల యాగం నిర్వహించనున్నారు.

ఈ వేడుకలకు సంబంధించి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. థ్రిల్ సిటీ, నెక్లెస్ రోడ్‌లో సీఎం జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను తెలుపుతూ ఒక డాక్యుమెంటరీని ప్రదర్శిస్తారని చెప్పారు. అనంతరం గత ఎనిమిదేళ్లలో కేసీఆర్ సాధించిన విజయాలను తెలియజేస్తూ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శిస్తారని తెలిపారు. ఇక, వేడుకల్లో భాగంగా 69 కేజీల కేక్‌ను కూడా కట్ చేయనున్నారు. 

మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జీహెచ్‌ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు.. అన్ని నియోజకవర్గాలు, వార్డుల వారీగా కేక్‌ కటింగ్ వేడుకల్లో పాల్గొంటారని మంత్రి తలసాని చెప్పారు. అలాగే రక్తదాన శిబిరాలు, అన్నదానం, పండ్లు పంపిణీ కార్యక్రమాలు, ఇతర సామాజిక సేవా కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారని తెలిపారు.

ఇక, జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనుండగా.. డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డి సికింద్రాబాద్‌లోని గణేష్ ఆలయంలో చండీయాగం నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి ఆయురారోగ్యాలతో ఆశీస్సులు పొందాలని కోరుతూ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో ఆయుష్ హోమం నిర్వహించనున్నారు. బల్కంపేటలోని ఎల్లమ్మ ఆలయంలో మృత్యుంజయ హోమం, రాజశ్యామల యాగం, చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి ఆలయంలో సీఎం గోత్రంతో అర్చన, పాతబస్తీలోని లాల్ దర్వాజ సింహవాహిని ఆలయంలో లక్ష పుష్పార్చన, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అబిడ్స్, సికింద్రాబాద్ క్లాక్ టవర్ ఏరియాలలోని వెస్లీ చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. నాంపల్లి దర్గా, నల్లగుట్ట మసీదుల్లో చాదర్‌లు సమర్పించనున్నారు. అమీర్‌పేట, గౌలిగూడలోని గురుద్వారాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు.

ఇక, రాష్ట్రవ్యాప్తంగా కూడా సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. అయితే ఈ కార్యక్రమాల్లో ఎక్కడా కూడా సీఎం కేసీఆర్ పాల్గొనడం లేదు. కేసీఆర్ శుక్రవారం తన అధికారిక నివాసం ప్రగతి భవన్‌కే పరిమితమవుతారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన పుట్టినరోజు జరుపుకోనున్నట్లుగా పేర్కొన్నాయి.