తెలంగాణ ఎన్నికల్లో 'ఏఐ'తో దెబ్బకొట్టిన రేవంత్ రెడ్డి.. !
Telangana Congress: మారుమూల గ్రామంలో స్థానిక ప్రజాప్రతినిధి నుంచి ముఖ్యమంత్రి పదవి వరకు అనుముల రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయాణం ఆసక్తికరంగా సాగింది. అయితే, ఈ ప్రయాణంలో ఆయనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కూడా సాయం చేసింది.
Anumula Revanth Reddy: యంగ్, డైనమిక్ అండ్ స్పిరిట్ ఉన్న నాయకుడిగా అసెంబ్లీ చర్చలలో చురుకుగా పాల్గొనడం, ప్రజా సమస్యలు, ప్రత్యర్థి పార్టీల నిర్లక్ష్యాన్ని, తప్పులను ఎత్తిచూపడంతో ప్రజల దృష్టిని ఆకర్షించి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు అనుముల రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి, తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. అయితే, ఇటీవల ముగిసిన ఎన్నికల్లో తనదైన తరహాలో ప్రచారం నిర్వహించి, కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చారు.
కాంగ్రెస్ అధికారంలోకి రావడం, రేవంత్ రెడ్డి ప్రచారంలో టెక్నాలజీ కీలక పాత్ర పోషించింది. ఇది కాస్త నమ్మశక్యంగా లేకపోయిన ఇది కూడా జరిగింది. ఇటీవల ముగిసిన తెలంగాణ ఎన్నికల్లో కృత్రిమ మేధ (ఏఐ)ను కాంగ్రెస్ విస్తృతంగా ఉపయోగించింది. ప్రజాదరణ పొందిన 'మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి' పాటను రూపొందించడానికి మాత్రమే కాకుండా ఓటర్ల ఎంపికలను అంచనా వేయడానికి కూడా ఏఐ సాంకేతికతను ఉపయోగించారు. ఏఐతో రూపొందించిన పాట, పలు నినాదాలు ప్రజల్లోకి దూసుకెళ్లాయి.
ఏఐ ఆధారంగా అంచనా నమూనాలను ఉపయోగించి అభ్యర్థులు, నినాదాలు మొదలైన వాటి ద్వారా ఓటర్లు ప్రభావితమయ్యే సంభావ్యతను కాంగ్రెస్ విశ్లేషించిందని పార్టీ వర్గాలను ఉటంకిస్తూ డీసీ నివేదించింది.
కాంగ్రెస్ ఏఐపై.. బీఆర్ఎస్ సంప్రదాయ ప్రచారంలో..
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో టెక్నాలజీ కీలక పాత్ర పోషించిందనే చెప్పాలి. కాంగ్రెస్ తో పోలిస్తే తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో భాగంగా సామాజిక మాధ్యమాలు, డిజిటల్ మార్కెటింగ్ పై పెద్దగా దృష్టి సారించకుండా ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించే సంప్రదాయ పద్ధతిపైనే భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆధారపడిందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ డిజిటల్ మార్కెట్ ప్రచారం, ఏఐ సాంకేతికత వినియోగంతో మంచి ఫలితాలు రాబట్టింది. డిజిటల్ మార్కెటింగ్ ప్రభావాన్ని విశ్లేషించడానికి పార్టీ ఏఐపై ఆధారపడింది. ప్రచార నిర్వహణకు కూడా కాంగ్రెస్ ఏఐని ఉపయోగించుకుంది. తెలంగాణ అధికార పీఠం దక్కించుకుంది.
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్..
ఎన్నికల ప్రచారంలో కృత్రిమ మేధను ఉపయోగించి మంచి ఫలితాలు రాబట్టి తెలంగాణ అసెంబ్లీలో 64 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. రేవంత్ తో పాటు పలువురు మంత్రులు అతిత్వరలో స్వీకారం చేయనున్నారు. హైదరాబాద్ లోని ఎల్ బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.