హైదరాబాద్‌లోని ప్రఖ్యాత చారిత్రక కట్టడం చార్మినార్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. చార్మినార్ వద్ద బాంబు ఉందంటూ వచ్చిన ఈ-మెయిల్ నేపథ్యంలోనే పోలీసులు ఈ తనిఖీలు నిర్వహించారు.  

చార్మినార్ పరిసరాల్లో సిటీ సెక్యూరిటీ వింగ్ విస్తృతంగా తనిఖీలు నిర్వహించింది. స్నిఫర్ డాగ్స్, మెటల్ డిటెక్టింగ్ పరికరాలను కూడా తనిఖీల్లో వినియోగించారు. చార్మినార్ వద్ద బాంబు ఉందంటూ ఓ అజ్ఞాత వ్యక్తి పంపిన ఈ-మెయిల్ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో రెండు గంటల పాటు చార్మినార్ పరిసరాల్లో తనిఖీలు చేపట్టారు. దీంతో ఆ పరిసర ప్రాంతాల ప్రజలు ఉలిక్కిపడ్డారు. 

అయితే పోలీసులు కూడా ప్రజలు ఆందోళన చెందే అవకాశం ఉందని భావించి.. చార్మినార్‌ వద్ద నిర్వహించింది సాధారణ తనిఖీలేనని చెప్పారు. ఎటువంటి బెదిరింపులు రాలేదని వారు పేర్కొన్నారు. అయితే ఆ తర్వాత చార్మినార్ వద్ద బాంబు ఉందంటూ వచ్చిన ఈ-మెయిల్ నేపథ్యంలోనే పోలీసులు తనిఖీలు నిర్వహించినట్టుగా తేలింది. అయితే విస్తృతంగా తనిఖీలు నిర్వహించిన అధికారులు.. అక్కడ ఏమి లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. 

ఈ బెదిరింపుకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే.. చార్మినార్ వద్ద బాంబు ఉందంటూ ఓ అజ్ఞాత వ్యక్తి ఆదివారం పోలీసులు ఈ-మెయిల్ పంపారు. ఈ మెయిల్ పంపిన వ్యక్తి దానితో పాటు ఓ మహిళా ఫొటోను కూడా పంపారు. ఆమె చార్మినార్ పరిసరాల్లో తిరుగుతుందని.. అక్కడ బాంబు పెట్టనున్నట్టుగా పేర్కొన్నారు. అయితే సోమవారం ఈ-మెయిల్ గుర్తించిన పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. రంగంలోకి దిగిన సిటీ సెక్యూరిటీ వింగ్.. చార్మినార్‌తో పాటు పరిసరాల్లో రెండు గంటల పాటు తనిఖీలు చేపట్టారు. 

అయితే ఈ-మెయిల్ పంపిన వ్యక్తికి.. ఫోటోలో ఉన్న మహిళతో సమస్యలు ఉండవచ్చని, ఆమెను బ్యాడ్ చేసేందుకు, అతను ఫేక్ మెయిల్ పంపి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈ-మెయిల్ పంపిన వ్యక్తిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.