పర్యావరణ పరిరక్షణలో భాగంగా వినాయక చవితిని పురస్కరించుకుని హెచ్ఎండీఏ లక్ష మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయనుంది. ఈ ఉచిత పంపిణీని హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ ప్రారంభించారు.
హైదరాబాద్: పర్యావరణ సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) నగర ప్రజలకు పిలుపు ఇచ్చింది. ఈ వినాయక నవరాత్రి ఉత్సవాల కోసం ప్రజలు పర్యావరణ హితంగా ఉండే మట్టి విగ్రహాలతో వేడుక చేసుకోవాలని హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ కోరారు. మట్టి విగ్రహాలను ప్రోత్సహించడానికి హెచ్ఎండీఏ ఈ ఏడాది ఒక లక్షల విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్టు వెల్లడించింది. ఈ నెల 31న వినాయక చవితి అన్న సంగతి తెలిసిందే. ఈ వినాయక చవితిని పురస్కరించుకుని ఎంఏ అండ్ యూడీ కార్యాలయంలో వారు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఇందులో సమాచార పౌరసంబంధాల శాఖ డైరెక్టర్ బి రాజమౌళి, అదనపు సంచాలకులు నాగయ్య కాంబ్లె, సంయుక్త సంచాలకులు డీఎస్ జగన్, డీ శ్రీనివాస్, ఉపసంచాాలకులు యాసా వెంకటేశ్వర్లు, ఇతర ఉన్నత అధికారులు పాల్గొన్నారు.
వినాయక నవరాత్రులను మట్టి విగ్రహాలతో ఉత్సవాలు చేసుకోవాలని వారు ప్రజలను కోరారు. తద్వార పిల్లల్లోనూ పర్యావరణం పట్ట చైతన్యం పెంచినవారం అవుతామని వివరించారు. పర్యావరణను పరిరక్షించుకోవడానికి మట్టి విగ్రహాలను హెచ్ఎండీఏ 2017 నుంచి ఉచితంగా పంపిణీ చేస్తున్నది. అప్పుడు 30 వేల మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తే.. ఈ ఏడాది 1 లక్ష మట్టి విగ్రహాలను పంపిణీ చేయనుంది.
నగరవ్యాప్తంగా 39 లొకేషన్లలో, అలాగే ఒక సంచార వాహనం, ఐదు రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ల ద్వారా వీటి పంపిణీ జరగనుంది. ఈ నెల 25వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఈ పంపిణీ జరుగుతుంది. 29వ తేదీ, 30వ తేదీ మాదాపూర్ మైండ్ స్పేస్, పెద్ద అంబర్‌పేట్ నగర పంచాయతీ ఆఫీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, సికింద్రాబాద్ గణేష్ టెంపుల్, హెచ్‌జీసీఎల్ ఆఫీసుల వద్ద మట్టి విగ్రహాల ఉచిత పంపిణీ ఉంటుంది. అవే రోజుల్లో మొబైల్ వెహికిల్స్ ద్వారా మియాపూర్‌లోని ఎస్ఎంఆర్ వినయ్, మై హోం జువెల్ పైప్ లైన్ రోడ్, ఇతర గేటెడ్ కమ్యూనిటీలు, ఇందు ఫార్చూన్ పరిసర ప్రాంతాలు, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, మలేషియన్ టౌన్‌షిప్‌లలో పంపినీ చేస్తారు. మరో ఐదు రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లూ పంపిణీ చేస్తాయి. విగ్రహాలు పంపిణీకి, పర్యవేక్షణకు ప్రాంతాల వారీగా ఇంచార్జీ అధికారులను నియమిస్తారు.
