హైదరాబాద్ మహానగరాభివృద్ది సంస్థ కమీషనర్ బి. జనార్థన్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం అరుదైన సమావేశంలో పాల్గొనే అవకాశం కల్పించింది. అమెరికాలో ఈ నెల 14-19 తేదీల్లో నోబెల్‌ బహుమతి గ్రహీతలతో జరిగే సమావేశంలో పాల్గొంనేందుకు ఐఎఎస్ అధికారులతో కూడిన బృందాన్ని కేంద్ర ప్రభుత్వం ఎంపికచేసింది. అందులో జనార్ధన్ రెడ్డికి కూడా స్థానం కల్పించింది.   

అమెరికా నార్త్‌ కరోలినాలోని డ్యూక్‌ వర్సిటీలో ఈ సమావేశం జరగనుంది. ఈ సదస్సులో ప్రపంచ దేశాలకు చెందిన అధికారులు, ప్రతిష్టాత్మక నోబెల్ అవార్డు గ్రహీతలతో సమావేశమవనున్నారు. గతంలో జీహెచ్ఎంసీ కమీషనర్‌గా పనిచేసిన జనార్ధన్ రెడ్డి స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంలో భాగంగా అనేక వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. ఇలా వివిధ సందర్భాల్లో అత్యుత్తమ పనితీరు కనబర్చిన అధికారులను నోబెల్ గ్రహీతలతో జరిగే సమావేశానికి కేంద్రం ఎంపికచేసింది. 

ఐదు రోజుల పాటు కమీషనర్ అమెరికా పర్యటనకు వెళుతుండటంతో హెచ్ఎండీఎ ఇంచార్జి కమీషనర్ గా స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ కమిషనర్‌ టి.చిరంజీవులు  వ్యవహరించనున్నారు. అందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది.