హైదరాబాద్: అబ్దుల్లాపూర్‌మెట్టు ఎమ్మార్వో విజయా రెడ్డిని సజీవ దహనం చేసిన తర్వాత రోడ్డుపై ఉన్న కారులో ఉన్న వ్యక్తులతో సురేష్ మాట్లాడినట్టుగా పోలీసులు గుర్తించారు. సురేష్ మాట్లాడిన వ్యక్తులు ఎవరనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ నెల 4వ తేదీన మధ్యాహ్నం ఒకటిన్నర గంటల సమయంలో సురేష్ అబ్దుల్లాపూర్ మెట్టు ఎమ్మార్వో విజయా రెడ్డి చాంబర్ లోకి వెళ్లి ఆమెపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేశాడు.

AlsoRead విజయారెడ్డి అంత్యక్రియల్లో...సీఎం కేసీఆర్ కి చేదు అనుభవం...

భూ వివాదం విషయమై సురేష్, ఎమ్మార్వోతో వాగ్వాదానికి దిగి ఆమెను చంపినట్టుగా భావిస్తున్నారు. ఎమ్మార్వో కార్యాలయంలోని గోడ గడియారం మధ్యాహ్నం 01:55 గంటలకు ఆగిపోయింది. ఎమ్మార్వో కార్యాలయంలో మంటలు వ్యాపించడంతో ఈ గోడ గడియారం ఆగిపోయినట్టుగా పోలీసులు అభిప్రాయపడుతున్నారు.

అంతేకాదు ఎమ్మార్వో విజయా రెడ్డి మంటలకు ఈ చాంబర్ లో ఉన్న ఏసీ పేలిందని చెబుతూ సురేష్ ఎమ్మార్వో విజయారెడ్డి చాంబర్ నుండి బయటకు వచ్చాడు.ఎమ్మార్వో విజయారెడ్డి చాంబర్‌  నుండి  సురేష్ కాలిన గాయాలతోనే బయటకు వచ్చాడు.

AlsoRead వెనుక గేటు నుండి వచ్చి ఎమ్మార్వో విజయా రెడ్డిని సజీవ దహనం చేసిన సురేష్...

ఏసీ పేలిపోయి మంటలు వ్యాపించాయంటూ బయటకు పరుగెత్తాడు. ఈ సమయంలో  ఎమ్మార్వో కార్యాలయంలో ఓ ఉద్యోగిని హత్తుకొనేందుకు సురేష్ ప్రయత్నించాడు. కానీ, అతను తప్పించుకొన్నాడు.

కాలిన గాయాలతో ఇబ్బంది పడ్డ సురేష్ ఎమ్మార్వో కార్యాలయం నుండి తన చొక్కాను విప్పేసుకొంటూనే రోడ్డుపై నడుచుకొంటూ వెళ్లిపోయాడు. ఆ సమయంలో ఆ దారి గుండా వెళ్లిన వారంతా సురేష్ ను చూసి పిచ్చివాడనుకొన్నారు.

ఆ సమయంలో తనను చూసిన వారు అనుమానించకుండా ఉండేందుకు గాను సురేష్  పిచ్చివాడిగా ప్రవర్తించినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఎమ్మార్వో కార్యాలయం నుండి వచ్చిన సురేష్ రోడ్డుపై నిలిపిన  కారులో వ్యక్తులతో మాట్లాడారు.

సురేష్ రోడ్డుపైకి వచ్చే సమయంలో అతడిని చూసిన పోలీసులు కూడ అతడిని పిచ్చివాడిగా భావించారు.  కారులో ఉన్న వ్యక్తులతో మాట్లాడిన సురేష్ అక్కడి నుండి నేరుగా పోలీస్ స్టేషన్‌ వద్దకు వెళ్లాడు.

 పోలీసులు అతడిని చూసి రియాక్టర్ పేలి తాను గాయపడినట్టుగా చెప్పారు. వెంటనే పోలీసులు అతడిని హయత్ నగర్ ఆసుపత్రికి తరలించినట్టుగా సమాచారం.ఎమ్మార్వో విజయా రెడ్డిని సజీవ దహనం చేసిన తర్వాత  సురేష్ రోడ్డుపై నడుచుకొంటూ వెళ్తున్న సీసీటీవీ దృశ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.

అబ్దుల్లాపూర్‌మెట్టు పోలీసులు ఎమ్మార్వో విజయా రెడ్డి చాంబర్ ‌లో కీలక ఆధారాలను సేకరించారు. విజయా రెడ్డి టేబుల్‌పై ఉన్న పేపర్ వెయిట్, పెన్నుల స్టాండ్,ఫైల్స్, కాగితాలు, టేబుల్‌, విజయారెడ్డి కూర్చొనే కుర్చీ, లైటర్, అగ్గిపెట్టె, పెట్రోల్ క్యాన్, పెట్రోల్ క్యాన్ సంచిని పోలీస్ క్లూస్ టీమ్ సేకరించింది. ఈ వస్తువులను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు.

సురేష్ ఎమ్మార్వో విజయా రెడ్డి చాంబర్‌లోకి వెళ్లిన వెంటనే ఆమెతో గొడవకు దిగినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఎమ్వార్వో విజయా రెడ్డిని సజీవ దహనం చేసే సమయంలో ఏం జరిగిందనే విషయమై పోలీసులు మరోసారి సురేష్‌ను విచారించే అవకాశం ఉంది.