Asianet News TeluguAsianet News Telugu

తండ్రికి లేఖ, ట్యాంక్‌బండ్‌పై నుంచి మిత్రుడికి వీడియో కాల్: దొరకని మౌనిక ఆచూకీ

హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లో అదృశ్యమైన డిగ్రీ విద్యార్ధిని మౌనిక ఆచూకీ ఇంతవరకు లభించలేదు. నాలుగు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ తండ్రికి లేఖ రాసి ఆమె అదృశ్యమైంది

himayatnagar degree student mounika missing case
Author
Hyderabad, First Published Nov 30, 2019, 9:19 PM IST

హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లో అదృశ్యమైన డిగ్రీ విద్యార్ధిని మౌనిక ఆచూకీ ఇంతవరకు లభించలేదు. నాలుగు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ తండ్రికి లేఖ రాసి ఆమె అదృశ్యమైంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కేసును ఛేదించేందుకు ప్రయత్నిస్తున్నారు.

మౌనిక లిబర్టీ వైపు నుంచి సికింద్రాబాద్ వైపు నడుచుకుంటూ వెళ్లిపోయిపోయినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. మౌనిక తన ఫోన్‌ను స్విచ్ఛాఫ్ చేయడానికి ముందు తన గ్రామానికి చెందిన నరేశ్ అనే యువకుడితో వాట్సాప్ వీడియో కాల్ మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు.

Also Read:అమ్మాయి మిస్సయ్యిదంటే... అసభ్యంగా మాట్లాడుతున్నారు: పోలీసుల తీరుపై రోజా ఫైర్

నిజామాబాద్ జిల్లా నవీపేట్‌కు చెందిన శ్రీనివాస్ కుమార్తె మౌనిక.. హైదరాబాద్ హిమాయత్ నగర్‌లోని గౌడ హాస్టల్‌లో ఉంటూ స్థానిక కేశవ మెమోరియల్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది.

ఈ నెల 26న రాత్రి తండ్రికి ఫోన్ చేసిన మౌనిక తన గ్రామానికే చెందిన పాత మిత్రుడు మణిరత్నం తనకు ఫోన్ చేసి వేధిస్తున్నాడని వాపోయింది. అతని సంగతి తాను చూసుకుంటానని, భయపడవద్దని శ్రీనివాస్ ఓదార్చాడు. అంతేకాకుండా ఆమెను ఇంటికి తీసుకురావాల్సిందిగా కుమారుడు నందరాజ్‌గౌడ్‌ను హైదరాబాద్‌కు పంపించాడు.

అతను వచ్చేలోగా బుధవారం ఉదయం ఆరు గంటల సమయంలో మౌనిక హాస్టల్‌ నుంచి బయటకు వెళ్లింది. తోటి స్నేహితులతో కలిసి నందరాజ్ హాస్టల్ గదిని వెతకగా సూసైడ్ నోట్ లభించింది. దీంతో కంగారుపడిన అతను తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పడంతో పాటు నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించారు. మౌనిక ట్యాంక్‌బండ్‌పై నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు కనిపించడంతో ఆ పరిసరాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. గ్రామానికి చెందిన మణిరత్నం వేధింపుల వల్లే ఆమె అదృశ్యమైందా..? లేక మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో పోలీసులు భావిస్తున్నారు.

మౌనిక అదృశ్యమై మూడు రోజులు గడుస్తున్నా ఇంకా ఆచూకీ లభించకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా మౌనిక అదృశ్యం కావడానికి ముందు తనతో వాట్సాప్ వీడియో కాల్ మాట్లాడినందని నవీపేట్‌కు చెందిన ఆమె మిత్రుడు నరేశ్ చెప్పాడు.

బుధవారం ఉదయం ఆరున్నర దాటిన తర్వాత తనకు వాట్సాప్‌లో తాను చనిపోతున్నట్లు మెసేజ్ పెట్టిందని నరేశ్ చెప్పాడు. దానికి కంగారు పడిన తాను చనిపోవద్దని వారించానని మెసేజ్ చేశానని తెలిపాడు.

దానికి స్పందించిన మౌనిక తాను ఎక్కడ ఉన్నది చూపిస్తానంటూ మౌనిక వాట్సాప్‌ వీడియో కాల్ చేసిందని, ఆ సమయంలో ఆమె ట్యాంక్‌బండ్‌పై ఉందన్నాడు. అయితే ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడవద్దని తాను సర్ధిచెప్పే ప్రయత్నం చేశానని, అయితే మణిరత్నం వేధింపులు భరించలేకపోతున్నానని చెప్పి ఫోన్ స్విచ్ఛాప్ చేసిందని నరేశ్ వెల్లడించాడు.

దీంతో తాను వెంటనే మౌనికతో పాటు వుండే యువతికి, మౌనిక సోదరుడు నందరాజ్‌కు ఫోన్ చేసి విషయం చెప్పానన్నాడు. తనకు గతేడాది డిసెంబర్ నుంచి మౌనికతో పరిచయం వుందని, తరచూ తామిద్దరం ఫోన్‌లో మాట్లాడుకుంటున్నామన్నాడు.

మణిరత్నం వేధింపులపై కూడా గతంలో తన వద్ద ప్రస్తావించిందని, అతను ఆమె చదువుకుంటున్న కాలేజీకి కూడా వచ్చాడని చెప్పాడు. ఆ సమయంలో ఫిర్యాదు చేయడంతో అతనికి పోలీసులు వార్నింగ్ ఇచ్చి లెటర్ కూడా రాయించారని మౌనిక తనతో చెప్పిందని నరేశ్ పేర్కొన్నాడు.

Also Read:చర్లపల్లికి ప్రియాంక నిందితులు: హై సెక్యూరిటీ బ్లాక్‌లో సెల్, ఖైదీ నెంబర్లు ఇవే

ఇదే సమయంలో మౌనికతో గంటలు గంటలు నరేశ్ ఫోన్‌లో మాట్లాడుతున్న వైనంపై పోలీసులు అనుమానిస్తున్నారు. మౌనిక, నరేశ్, మణిరత్నం కాల్ డేటాను విశ్లేషిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Follow Us:
Download App:
  • android
  • ios