హైదరాబాద్ లో మరోసారి హిజ్రాలు రెచ్చిపోయారు. ఏకంగా నగరంలోని ఓ పోలీస్ స్టేషన్ వద్ద అలజడి సృష్టిస్తూ అడ్డుకోడానికి ప్రయత్నించిన పోలీస్ ఉన్నతాధికారి(ఏసిపి) పైనే దాడికి పూనుకున్నారు. ఈ క్రమంలో వారి నుండి ఏసిపి తప్పించుకోగా ఇద్దరు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. 

ఈ ఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ వద్ద చోటుచేసుకుంది. ఓ వివాదం కారణంగా నగరంలోని హిజ్రాలంతా  కలిసి ఉప్పల్ పోలీస్ స్టేషన్ వద్ద భారీగా గుమిగూడారు. ఈ క్రమంలో కొందరు హిజ్రాలు పోలీసులతో గొడవకు దిగారు. దీంతో వారిని సర్దిచెప్పడానికి వచ్చిన ఏసిపి గాంధీ నారాయణ పై దాడికి ప్రయత్నించారు. అయితే ఈ దాడి నుండి ఆయన సురక్షితంగా బయటపడ్డారు. కానీ అక్కడే వున్న ఇద్దరు హోంగార్డులు వీరి చేతిలో దాడికి గురై తీవ్రంగా గాయపడ్డారు. వీరు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

ఈ  అలజడికి, పోలీసులపై దాడికి కారణమైన హిజ్రాలను అరెస్ట్ చేయాల్సిందిగా ఏసిపి ఆదేశించారు. అంతేకాకుండా పోలీస్ స్టేషన్ వద్ద మరింత భద్రత పెంచాల్సిందిగా సూచించారు. 

మంగళవారం కూడా ఇలాగే కొందరు హిజ్రాలు ఓ నకిలీ హిజ్రాను పట్టుకుని నడిరోడ్డుపై తీవ్రంగా కొడుతూ హంగామా సృష్టించారు. మూకుమ్మడిగా కర్రలతో కొడుతూ, కాళ్లతో తంతూ సదరు యువకున్ని తీవ్రంగా  గాయపర్చారు. ఈ ఘటన మరువక ముందే మరోసారి హైదరాబాద్ లో వీరంగం సృష్టించారు.