మహిళలు పొట్టి దుస్తులు వేసుకోవడంతోనే సమస్య అని తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 

హైదరాబాద్ : హైదరాబాద్‌లోని ఐఎస్ సదన్ చౌరస్తాలోని కేవీ రంగారెడ్డి మహిళా డిగ్రీ కళాశాలలో చెలరేగిన హిజాబ్ వివాదం మీద హోం మంత్రి మహమూద్ అలీ స్పందించారు. ఎవరి ఆహార్యాన్నైనా గౌరవించాలన్నారు. తలనుంచి పాదాల వరకు కప్పి ఉంచే దుస్తుల విషయంలో గొడవ తగదన్నారు. అమ్మాయిలు దుస్తులు వేసుకుంటే సమస్య కాదు... పొట్టి దుస్తులు వేసుకోవడంతోనే సమస్య అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆయన వ్యాఖ్యల మీద దుమారం రేగుతోంది. 

ఇదిలా ఉండగా, శనివారం ఉదయం హైదరాబాద్‌లోని కేవీ రంగారెడ్డి మహిళా డిగ్రీ కళాశాలలో హిజాబ్ వివాదం తెరమీదకు వచ్చింది. హిజాబ్ ధరించి పరీక్ష రాసేందుకు వచ్చిన ముస్లిం విద్యార్థినులను కాలేజ్ సిబ్బంది లోపలికి వెళ్లనివ్వమని చెప్పడం వివాదానికి దారితీసింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. కేవీ రంగారెడ్డి మహిళా డిగ్రీ కళాశాల సంతోష్‌నగర్‌ ఐఎస్ సదన్‌ చౌరస్తాలో ఉంది. 

Scroll to load tweet…

హైదరాబాద్‌లో కేవీ రంగారెడ్డి కాలేజ్‌లో హిజాబ్‌ వివాదం.. హోం మంత్రి మహమూద్ అలీకి ఫిర్యాదు..!!

ఈ కాలేజీలో పరీక్షలు జరగుతున్నాయి. పలువురు ముస్లిం విద్యార్థినులు శుక్రవారం నిర్వహించిన డిగ్రీ ఉర్దూ మీడియం సప్లిమెంటరీ పరీక్షకు హిజాబ్‌ ధరించి వచ్చారు. అయితే. పరీక్షా కేంద్రంలోకి వారిని కాలేజీ సిబ్బంది అనుమతించడానికి నిరాకరించింది. హిజాబ్‌తో రావద్దని సూచించినట్టుగా తెలుస్తోంది. అలా చెప్పడంతో విద్యార్థినులకు, కాలేజ్ సిబ్బందికి మధ్య వాగ్వాదం తలెత్తింది. 

వారితో గొడవెందుకనుకున్న కొంతమంది విద్యార్థినులు హిజాబ్ తీసేసి పరీక్షా కేంద్రంలోకి వెళ్లినట్టుగా సమాచారం. కాసేపటికి.. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో హిజాబ్‌తోనే విద్యార్థినులను పరీక్షకు అనుమతించారట. దీనిమీద విద్యార్థినులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అరగంటపాటు తమను ఆపేశారని చెప్పుకొచ్చారు. చివరకు హిజాబ్ తీసేసిన తరువాత లోనికి అనుమతించారన్నారు. 

గతంలో ఎప్పుడూ ఇలా చేయలేదన్నారు. మరో పరీక్షకు హిజాబ్‌ లేకుండానే రావాలని కాలేజ్ యాజమాన్యం చెప్పిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి విద్యార్థినుల తల్లిదండ్రులు రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీకి ఫిర్యాదు చేశారు. ముస్లిం మహిళలకు హిజాబ్ అనేది సర్వసాధారణమని చెప్పారు. పరీక్షా కేంద్రంలోకి హిజాబ్‌తో విద్యార్థినులను అనుమతించకపోవడంపై విచారణ జరిపించి, చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.