ఎన్ని ట్రాఫిక్ చట్టాలు వస్తున్నా.. నిఘా కెమెరాలకు చలానాలు రాస్తున్నా వాహనదారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఈ క్రమంలో జేబులకు చిల్లు పెడితే కానీ జనం దారిలోకి రారని గ్రహించిన కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 1 నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్ తెస్తోంది.

ఈ ఏడాది ఆగస్టు 9న పార్లమెంట్ ఆమోదించిన మోహార్ వాహనాల(సవరణ) చట్టం ప్రకారం దేశవ్యాప్తంగా కొన్ని ఖచ్చితమైన నియమ నిబంధనలు అమల్లోకి రానున్నాయి.

వాహనదారులు ఇకపై రోడ్డెక్కాలంటే వీటిని పాటించాల్సిందే.. లేదంటే జేబులకు చిల్లే. ప్రధానంగా మద్యం తాగి వాహనం నడిపే వాహనదారులు పోలీస్ స్పెషల్ డ్రైవ్‌లో పట్టుబడితే రూ.10 వేల జరిమానా తప్పదు..

ఇక మైనర్ల విషయంలో కేంద్రం కఠినంగా వ్యవహరించేందుకు చట్టంలో నిబంధనలు మార్చింది. మైనర్‌లు వాహనాలు నడపడం వల్ల పెద్దఎత్తున ప్రమాదాలు జరుగుతున్నాయని భావించిన కేంద్రం రూ. 25 వేల జరిమానా, అలాగే వాహనం ఇచ్చే గార్డియన్‌కు కానీ, వాహన యజమానికి కానీ రూ.25 వేల జరిమానాతో పాటు మూడేళ్ల జైలు శిక్ష పడనుంది.

వాహనాల లైసెన్స్‌ల విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానా పడే అవకాశం వుంది. అలాగే ఎమర్జెన్సీ వాహనాలకు దారివ్వకపోతే రూ.10 వేలు, ర్యాష్ డ్రైవింగ్, లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసినా, సెల్‌ఫోన్ డ్రైవింగ్, రాంగ్‌రూట్‌కు రూ. 5 వేలు జరిమానా విధించనున్నారు.

అయితే కొత్త చట్టం వల్ల లంచాలు, అవినీతి విపరీతంగా పెరిగిపోతాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ ఆటో మరియు మోటార్ వెల్ఫేర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి దయానంద్ మాట్లాడుతూ.. వాహన ప్రమాదాలను నివారించేందుకు కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచిదే అయినప్పటికీ.. కొందరు శిక్షలు తప్పించుకునేందుకు అధికారులకు లంచం ఇచ్చే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఉదాహరణకు రూ.10 వేల జరిమానాను తప్పించుకోవడానికి రూ.1000 రూపాయలు ఇచ్చేందుకు సైతం వాహనదారులు వెనుకాడరని దయానంద్ అభిప్రాయపడ్డారు. మరోవైపు కొందరు వాహనదారులు సైతం జరిమానాల పట్ల మండిపడ్డారు.

అందరూ రూ.5,000, 10,000 రూపాయలు జరిమానాలు కట్టేస్థితిలో ఉండరని ధ్వజమెత్తారు. అయితే కొత్త వాహన చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామంటున్నారు హైదరాబాద్ నగర ట్రాఫిక్ అదనపు కమీషనర్ అనిల్.

ఈ చట్టం వల్ల వాహనదారులు క్రమశిక్షణతో ఉంటారని.. జరిమానాలు కట్టనిపక్షంలో వాహనాన్ని సీజ్ చేస్తామని.... లంచాలు తీసుకుంటే సిబ్బందిపై కఠినచర్యలు తీసుకుంటామని అనిల్ హెచ్చరించారు. 

ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే... భారీ మూల్యం చెల్లించక తప్పదు