క్యాన్సర్ రోగికి కరోనా...ప్రమాదకరంగా ప్రైమరీ కాంటాక్టు చైన్

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరోనా మహమ్మారి మరోసారి కలకలం రేపింది. 

High tension in jagityal dist... cancer patient infected  with corona

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మరో కరోనా పాజిటివ్ కేసు వెలుగులోకి రావడంతో రెండు జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఆనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ కావడంతో కరీంనగర్, జగిత్యాల జిల్లాల అధికారులు అలర్ట్ అయ్యారు. దీంతో కరోనా ఫ్రీగా మారిన జగిత్యాల జిల్లాలో మళ్లీ కలకలం రేగింది. ప్రమాదం నుంచి గట్టెక్కిందనుకున్న కరీంనగర్ లోనూ మళ్లీ హై టెన్షన్ మొదలైంది.

జగిత్యాల జిల్లాలో కొత్తగా నిర్ధారణ అయిన కరోనా పాజిటివ్ కేసుతో రెండు జిల్లాలకు సంబంధం ఉండటంతో అధికారులు.. ఆ పేషెంట్ తో కాంటాక్ట్ అయిన వారి వివరాలను సేకరిస్తున్నారు. జగిత్యాల జిల్లాకు చెందిన ఓ వృద్ధునికి కరోనా సోకిందన్న నిజం ఇప్పుడు ప్రజల్లోనూ, అధికారుల్లోనూ కలవరం రేపుతోన్నది.

ఇటీవల మహారాష్ట్రలోని భీవండికి వెళ్లి వచ్చినట్లు భావిస్తున్న జగిత్యాల జిల్లాలోని మల్యాల మండలం తక్కళ్లపల్లికి చెందిన వృద్ధునికి నిర్వహించిన పరీక్షల్లో కొవిడ్-19 సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. కొంతకాలం క్రితం నుంచి అతను క్యాన్సర్ తోనూ బాధపడుతున్నాడు. దీంతో ఇద్దరు బంధువుల సహాయంతో గతనెల 26న జగిత్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లగా అక్కడి వైద్యులు కరీంనగర్ లోని చల్మెడ మెడికల్ కళాశాలలోని క్యాన్సర్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. దీంతో అతను చల్మెడ ఆసుపత్రికి వెళ్లి దాదాపు నాలుగు రోజుల పాటు చికిత్స తీసుకున్నాడు. ఈ క్రమంలోనే కరోనా లక్షణాలు బయటపడ్డాయి. 

ఆ తర్వాత అతడిని హైదరాబాద్ నిమ్స్ కు తరలించారు. అక్కడ చేసిన వైద్య పరీక్షల్లోనూ కరోనా పాజిటివ్ అని తేలడంతో అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. దీంతో ఆ పేషెంట్ నివసించే తక్కళ్లపల్లి గ్రామంతో పాటు మానాల, మ్యాడంపల్లి, లంబాడిపల్లి గ్రామాలను కంటైన్ మెంట్ జోన్ గా గుర్తించారు. ఈ ప్రాంతాల్లో రహదారులను మూసివేసి.. ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని చెప్పారు. 24 వైద్యబృందాలు గ్రామాల్లో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నాయి.

ఈ సమయంలో ఆ వ్యక్తి ఎవరెవరిని కలిశారన్న విషయంలో అధికారులు టెన్షన్ పడుతున్నారు. ప్రస్తుతం బాధితుడి భార్య, అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లిన ఇద్దరు బంధువులు, ఆటో డ్రైవర్ ను క్వారంటైన్ కు తరలించారు. అతడికి చికిత్స చేసిన జగిత్యాలలోని ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుడు, అక్కడి సిబ్బందితో పాటు, గ్రామంలోని ప్రైమరీ కాంటాక్టులపై జగిత్యాల పోలీసులు ఆరా తీస్తున్నారు. అదేవిధంగా చల్మెడ క్యాన్సర్ ఆసుపత్రిలో కూడా అతనికి చికిత్స చేసిన వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది వివరాలను కూడా కరీంనగర్ రూరల్ పోలీసులు సేకరించారు.

కరీంనగర్ కు చెందిన పేషెంట్ బంధువొకరు ప్రతిరోజూ భోజనం తీసుకెళ్లేవాడని, అతను ఓ ప్రభుత్వ ఉద్యోగి అని గుర్తించారు. దీంతో అతను పనిచేసే కార్యాలయం సిబ్బంది వివరాలు, ఎవరెవరిని కలిశారన్న సమాచారం సేకరిస్తున్నారు. చల్మెడ మెడికల్ కళాశాలలో ఉన్న రోజుల్లో కొంతమంది బంధువులు కూడా వచ్చి కలిశారని గుర్తించారు. ఇంకోవైపు పేషెంట్ కుమారుడు హైదరాబాద్ లో ఉంటున్నట్లు సమాచారం. అతను కూడా కరీంనగర్ వచ్చాడా..? వస్తే ఎవరెవరిని కలిశాడన్న సమాచారం కూడా సేకరిస్తున్నారు. ఒక్క పేషెంట్ తో అనేక మందికి ప్రైమరీ కాంటాక్టు ఉన్న చైన్ బయట పడుతుండటంతో ఇప్పుడు అంతటా హైరానా, ఆందోళన కనిపిస్తోన్నది.

నిజానికి కరీంనగర్ జిల్లాలో 19 కరోనా కేసుల్లో 18 మంది ఇప్పటికే కోలుకుని ఇక ఫర్వాలేదు అనుకుంటున్న క్రమంలో కొత్తగా వచ్చిన కేసు మళ్లీ ఒక్కసారిగా ఆందోళన క్రియేట్ చేసింది. అటు జగిత్యాల జిల్లాలోనూ కరోనా సోకిన ముగ్గురూ కోలుకోవడంతో.. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్న ప్రజలకు, అధికారులకు తాజా కేసు కలవరపరుస్తోన్నది. 

జగిత్యాలలో వెలుగు చూసిన కొత్త కొవిడ్-19 కేసుతో ప్రస్తుతం అంతటా అప్రమత్తత కొనసాగుతోన్నది. అనుమానం ఉన్న వాళ్లంతా సెల్ఫ్ క్వారంటైన్ కు వెళ్లాలని ఇప్పటికే అధికారులు ఆదేశించారు. రోగిని కలిసిన వాళ్లు నేరుగా అధికారులకు సమాచారం అందించాలని కోరుతున్నారు. మొత్తంగా ఈ చైనంతా గుర్తించి మళ్లీ వైరస్ వ్యాపించకుండా తీసుకోవాల్సిన చర్యలపై నిమగ్నమయ్యారు రెండు జిల్లాల్లోని అధికారులు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios