కామారెడ్డి కలెక్టరేట్ వద్ద రైతుల ఆందోళన తీవ్ర రూపు దాల్చింది. ఈ క్రమంలో కలెక్టరేట్ గేట్లు ధ్వంసం చేసి లోపలికి చొచ్చుకెళ్లారు రైతులు. ఈ తోపులాటలో పలువురు రైతులు, పోలీసులు తీవ్రగాయాలయ్యాయి.

కామారెడ్డి కలెక్టరేట్ వద్ద రైతుల ఆందోళన తీవ్ర రూపు దాల్చింది. ఈ క్రమంలో కలెక్టరేట్ గేట్లు ధ్వంసం చేసి లోపలికి చొచ్చుకెళ్లారు రైతులు. ఈ తోపులాటలో పలువురు రైతులు, పోలీసులు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఉద్రిక్తతలో స్పృహతప్పి పడిపోయింది ఓ మహిళ. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు బారికేడ్లను తోసేశారు. అయితే కలెక్టర్ మొండివైఖరి కారణంగానే పరిస్ధితి అదుపు తప్పిందని రైతులు అంటున్నారు. తమతో మాట్లాడకూడదనే పంతంతో కలెక్టర్ వున్నారని వారు చెబుతున్నారు. ఎట్టిపరిస్ధితుల్లో కలెక్టర్ వచ్చి మాట్లాడాల్సిందేనని అన్నదాతలు తేల్చిచెబుతున్నారు. 

కాగా.. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పరిధిలోకి ఎల్లారెడ్డి, కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది గ్రామాలను చేర్చారు.ఈ గ్రామాల్లోని రైతుల నుండి భూములను సేకరించి ఇండస్ట్రీయల్ కారిడార్ కు కేటాయించనున్నారు. ఈ ప్రతిపాదనను రైతులు వ్యతిరేకిస్తున్నారు.తమకు జీవనోపాధిని కల్పించే భూములను ఇవ్వబోమని రైతులు చెబుతున్నారు.

ALso Read: కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌పై రైతుల ఆందోళన..స్పందించిన కేటీఆర్, మున్సిపల్ కమీషనర్‌పై ఆగ్రహం

మరోవైపు.. తన భూమి పోతోందనే భయంతో రాములు అనే రైతు నిన్న ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో ఇవాళ ఎనిమిది గ్రామాల రైతులు ర్యాలీగా కలెక్టరేట్ కు చేరుకుని ఆందోళనకు దిగారు. తాము భూములను వదులుకొనే ప్రసక్తేలేదని రైతులు చెప్పారు.ఇదిలా ఉంటే రైతులకు మద్దతుగా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు , ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డిలు సైతం ధర్నాలో పాల్గొన్నారు. 

ఈ క్రమంలో కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌పై మంత్రి కేటీఆర్ స్పందించారు. మాస్టర్ ప్లాన్ సమస్య ఎందుకొచ్చిందని మున్సిపల్ కమీషనర్‌ను ఆయన ప్రశ్నించారు. మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ స్టేజ్‌లో వుందని ఎందుకు ప్రజలకు చెప్పలేకపోయారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి ఇండస్ట్రియల్ జోన్‌పై కొందరు ఆందోళన చేస్తున్నారని.. ఈ ప్రభుత్వం ఎవరినో ఇబ్బంది పెట్టడానికి లేదని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రజలకు సాయం చేసేందుకే వున్నామని... నగరాల అభివృద్ధి కోసమే మాస్టర్ ప్లాన్ అని మంత్రి అన్నారు.