కోమటిరెడ్డి, సంపత్ కేసులో షాకింగ్ ట్విస్ట్...
తెలంగాణ సర్కారుపై మరోసారి హైకోర్టు ఆగ్రహాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేసింది. కాంగ్రెస్ శాసనసభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ల సభ్యత్వ రద్దు కేసులో సర్కారు వైఖరి సరిగా లేదని కోర్టు ఆగ్రహించింది. వీడియో పుటేజీతో కూడిన కౌంటర్ దాఖలు చేయాలన్న ఆదేశాలను అమలు చేయకపోవడంతో న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
మంగళవారం హైకోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. ఈ కేసు విచారణకు ప్రభుత్వం తరుపున హాజరైన అడిషనల్ అడ్వొకెట్ జనరల్ రామచందర్ రావు వాదించారు. తమకు మరింత సమయం కావాలని హైకోర్టును అభ్యర్థించారు. అయితే హైకోర్టు అందుకు నో చెప్పింది. ఇప్పటికే చాలా సమయం ఇచ్చామని, ఇంకా గడువు ఇవ్వడం కుదరదు అని తేల్చి చెప్పింది. అంతేకాదు కౌంటర్ దాఖలు చేయడానికి చివరి అవకాశం ఇచ్చింది. ఈనెల 6వ తేదీ లోగా కౌంటర్ దాఖలు చేయాలని కేవలం మూడు రోజులు మాత్రమే సమయం ఇచ్చి కేసును 6వ తేదీకి వాయిదా వేసింది.
తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా కౌంటర్ ధాఖలు చేయకపోవడం పై హైకోర్టు సీరియస్ అయింది. శుక్రవారం వరకు కౌంటర్ దాఖలు చేస్తే సోమవారం నుంచి ఈ కేసులో వాదనలు వింటామని న్యాయస్థానం తెలిపింది. ఒకవేళ ఈ కేసులో ప్రభుత్వం తరుపున కౌంటర్ దాఖలు చేయకపోతే ఈ కేసులో ఇక కౌంటర్ ఉండదని భావించాల్సి ఉంటుందని హెచ్చరించింది హైకోర్టు.
మొత్తానికి కోమటిరెడ్డి, సంపత్ సభ్యత్వ రద్దు విషయంలో హకోర్టులో సర్కారు ఇరకాటంలో పడినట్లు కనబడుతున్నది. ఆత్మరక్షణ ధోరణిలో ఉన్నందునే మరింత సమయం కోరుతున్నారని న్యాయవర్గాలు అంటున్నాయి. ఇప్పటికే ఈ కేసులో అడ్వొకెట్ జనరల్ రాజీనామా చేయడం సర్కారుకు ఒక దెబ్బ కాగా.. తాజాగా కౌంటర్ దాఖలు చేయకుండా నానుస్తుండడంతో మరింత ఇరకాటంలోకి సర్కారు నెట్టబడుతున్నదని చెబుతున్నారు. మరోవైపు వీడియో పుటేజీ ఒకవైపు మాత్రమే ఉంది తప్ప రెండో వైపు పుటేజీ ఇంతవరకు బయట పెట్టకపోవడం కూడా వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.
