తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ల శాసనసభ సభ్యత్వాలు వివాదాస్పదంగా రద్దయ్యాయి. చిన్న తప్పుకే ఏకంగా వాళ్ల సభ్యత్వాల రద్దు చేపట్టడం ప్రజాస్వామ్య విరుద్ధమంటూ కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్ష బిజెపి కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. సర్కారు ఏకపక్షంగా వ్యవహరించిందని కాంగ్రెస్ ఆరోపించింది. అందుకే అన్న వేదికల మీద సస్పెన్షన్ కు వ్యతిరేకంగా పోరాటం షురూ చేసింది.

సస్పెన్షన్ పై హైకోర్టులో కోమటిరెడ్డి, సంపత్ కేసు వేశారు. ఆ కేసులో విచారణ జరిపిన హైకోర్టు సర్కారుకు చిన్నపాటి షాక్ ఇచ్చింది. నల్లగొండ, అలంపూర్ స్థానాలు ఖాళీ అయినట్లు కేంద్ర ఎన్నకల సంఘం ఎలాంటి నోటిఫికేషన్లు ఇవ్వరాదని హైకోర్టు ఆదేశించింది. ఆరు వారాల పాటు ఈ విషయంలో ఎలాంటి చర్యలు చేపట్టరాదని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసు ఇచ్చింది.

అలాగే గవర్నర్ ప్రసంగం సమయంలో తీసిన మొత్తం వరిజినల్ వీడియో పుటేజీని ఈనెల 22న అందజేయాలని హైకోర్టు ఆదేశించింది. దీనిపై కౌంటర్లు దాఖలు చేయాలని శాసనసభ కార్యదర్శికి, కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శికి, న్యాయ, శాసన వ్యవహారాల కార్యదర్శులకు ఆదేశిస్తూ.. కేసును ఈనెల 27వ తేదీకి వాయిదా వేసింది న్యాయస్థానం.

హైకోర్టు స్పందించడంతో ఈ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంతప్ లకు స్వల్ప ఊరట దక్కింది. ఈ నిర్ణయం తెలంగాణ సర్కారుకు చెంప పెట్టు అని కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో కామెంట్ చేశారు.