మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసుపై బీజేపీ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. ఈ కేసు దర్యాప్తుపై నవంబర్ 4 వరకు స్టే విధిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసుపై బీజేపీ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. ఈ కేసు దర్యాప్తుపై మునుగోడు ఉప ఎన్నిక ముగిసే వరకు స్టే విధిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే బీజేపీ దాఖలు చేసిన పిటిషన్‌పై 8 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.తదుపరి విచారణను నవంబర్ 4వ తేదీకి వాయిదా వేసింది. ఇక, ఈ కేసును సీబీఐ లేదా ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ చేయించాలని కోరుతూ బీజేపీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తెలంగాణ బీజేపీ ప్రధాన కార్యదర్శి జి ప్రేమేందర్‌రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు. అధికార టిఆర్ఎస్ చేత బీజేపీని ఇరికించాలని, ప్రతిష్టను దెబ్బతీయాలనే ఏకైక ఉద్దేశ్యంతో"సైబరాబాద్ కమిషనరేట్‌లోని మొయినాబాద్ పోలీసులు జారీ చేసిన ఎఫ్‌ఐఆర్‌పై రాష్ట్ర ప్రభుత్వం పక్షపాత, అన్యాయమైన దర్యాప్తును చేపట్టిందని పిటిషనర్ ఆరోపించారు.

ఇదిలా ఉంటే.. అంతకు ముందు నిందితుల రిమాండ్‌కు సంబంధించి ఏసీబీ కోర్టు తీర్పును సవాలు చేస్తూ పోలీసులు దాఖలు చేసిన రివిజన్‌ పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది. ఈ కేసులో నిందితుల రిమాండ్ రిజెక్ట్‌ చేస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ముగ్గురు నిందితుల రిమాండ్‌కు హైకోర్టు అనుమతించింది. నిందితులు వెంటనే సైబరాబాద్ పోలీసు కమిషన్ ముందు హాజరుకావాలని ఆదేశించింది. నిందితులను అరెస్ట్ చేసి అవినీతి నిరోధక శాఖ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది. ముగ్గురు నిందితులను రిమాండ్‌కు తరలించాలని హైకోర్టు తీర్పు వెలువరించింది. 

ఇక, టీఆర్‌ఎస్‌‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించేలా ప్రయత్నాలు జరిగాయనే వార్త తెలంగాణలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేల ఫిర్యాదుతోనే తాము ఈ యత్నాలను భగ్నం చేసినట్టుగా పోలీసులు వెల్లడించారు. కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి‌లు పార్టీ మారితే డబ్బు, కాంట్రాక్టులు, పదవులు ఇస్తామని కొందరు ప్రలోభపెట్టారని పోలీసులు చెప్పారు. ఇందుకు సంబంధించి రోహిత్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకన్న పోలీసులు.. ఫరీదాబాద్ ఆలయానికి చెందిన రామచంద్రభారతి, తిరుపతికి చెందిన సింహయాజి, హైదరాబాద్‌కు చెందిన నందకుమార్‌‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.