హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్  ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఉన్నత స్థాయిలో ఉన్నవారు ఎవరైనా అలా ఉండాలి.. ఇలా ఉండాలి అని సలహాలు ఇస్తూ ఉంటారు. కానీ... ఆచరణలో చేసి చూపించేవాళ్లు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు. కానీ జస్టిస్ చల్లా కోదండరామ్ మాత్రం పూర్తిగా భిన్నం. అందరికీ చెప్పడమే కాదు... చేతల్లో కూడా చేసి చూపెడతారు. తన తోటి న్యాయవాదులు, న్యాయమూర్తులు తిని పడేసిన ప్లేట్లను, గ్లాసులను ఆయన స్వయంగా ఏరివేసి అందరి ప్రశంసలు అందుకున్నారు.

ఇంతకీ మ్యాటరేంటంటే...  హైకోర్టు ప్రాంగణంలో శుక్రవారం సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ పీవీ సంజయ్ కుమార్ బదిలీ కావడంతో ఆయన వీడ్కోలు పార్టీ ఏర్పాటు చేశారు. పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. దీంతో... అతిథులకు టీ, స్నాక్స్ లాంటివి అందజేశారు. వాటిని తిన్న పలువురు ప్లేట్లను మాత్రం అక్కడే పడేశారు.

అలా చెత్తచెత్తగా పడేయడం చల్లా కోదండరామ్ కి నచ్చలేదు. అలా అని వారందరినీ వాటిని ఏరి వేయండి అని చెప్పలేదు. స్వయంగా ఆయనే వాటన్నింటినీ ఏరి చెత్తబుట్టలో పడేశారు. ఆయనను అలా చూసి న్యాయవాదులు ఆశ్చర్యపోయారు. సిబ్బందికి పురమాయించకుండా తానే ఆ ప్రదేశాన్ని శుభ్రం చేస్తుండటం అందర్నీ కదిలించింది. వెంటనే హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు సూర్యకిరణ్‌రెడ్డి సహా ఇతర న్యాయవాదులు కూడా జస్టిస్‌ కోదండరామ్‌తో పాటు ఎంగిలి ప్లేట్లను ఏరి, చెత్తకుండిలో పడేశారు.

నిమిషాల్లో కోర్టు ప్రాంగణమంతా శుభ్రంగా తయారైంది. ఈ సందర్భంగా జై స్వచ్ఛ భారత్‌ అంటూ నినాదాలు చేశారు. కాగా, తెలంగాణ హైకోర్టు నుంచి పంజాబ్‌- హరియాణ హైకోర్టుకు బదిలీపై వెళుతున్న జస్టిస్‌ పీవీ సంజయ్‌కుమార్‌కు ఫుల్‌కోర్టు శుక్రవారం ఘనంగా వీడ్కోలు పలికింది. సంజయ్‌కుమార్‌ సేవలను జస్టిస్‌ రామచంద్రరావు, అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ కొనియాడారు. అనంతరం న్యాయవాదుల సంఘం ప్రతినిధులు జస్టిస్‌ సంజయ్‌కుమార్‌ను సన్మానించారు.