హైదరాబాద్:బైసన్‌ పోల్ గ్రౌండ్స్‌లో తెలంగాణ ప్రభుత్వం సచివాలయ నిర్మాణానికి అడ్డంకులు తొలిగాయి.  55 ఎకరాల్లో  తెలంగాణ సచివాలయంతో పాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాలను నిర్మించాలని తెలంగాణ సర్కార్ తీసుకొన్న నిర్ణయంపై హైకోర్టులో  పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు మంగళవారం నాడు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

బైసన్ పోల్ గ్రౌండ్స్‌ను చట్టప్రకారంగా  చర్యలు తీసుకొనేందుకు కేంద్ర ప్రభుత్వానికి  స్వేచ్ఛనిస్తూ మంగళవారం నాడు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రక్షణ శాఖకు చెందిన బైసన్ పోల్ గ్రౌండ్స్‌లో కొత్త సచివాలయాన్ని నిర్మించాలని తలపెట్టింది.

ఈ మేరకు 55 ఎకరాల్లో  సచివాలయ నిర్మాణంతో పాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాలను నిర్మించాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకొన్నారు. అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుమారు 30 మందికిపైగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. 

ఈ పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. ఈ స్థలం విషయంలో ఎలాంటి స్టే లు ఇవ్వనందున సచివాలయ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలని  హైకోర్టును తెలంగాణ అడిషనల్ అడ్వకేట్ జనరల్ కోరారు.  

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు మంగళవారం నాడు హైకోర్టు కీలకమైన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ గ్రౌండ్ విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకొనేందుకు  కేంద్ర ప్రభుత్వానికి అధికారమిస్తూ హైకోర్టు ఇవాళ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ కేసు తుది విచారణను వచ్చే నెల 12వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు. అయితే వచ్చే వాయిదా వరకు ఈ భూముల విషయంలో కేంద్రం  ఏ రకమైన నిర్ణయం తీసుుకొంటుందో చూడాలి.

కేంద్ర ప్రభుత్వానికి చెందిన 55 ఎకరాల భూమిని సచివాలయ నిర్మాణానికి తీసుకొంటున్నందున.. అంతే స్థలాన్ని మరో చోట ఇస్తామని తెలంగాణ సర్కార్ కేంద్రానికి హామీ ఇచ్చింది.