Asianet News TeluguAsianet News Telugu

కోమటిరెడ్డి కేసులో కొత్త ట్విస్ట్.. కేసిఆర్ సర్కారుకు షాక్

కేసిఆర్ సర్కారుకు షాక్
High court insists on watching the Assembly footage of Komatireddy attack

తెలంగాణ అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ సభ్యులుగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ల శాసనసభ సభ్యత్వం రద్దు వ్యవహరం ఊహించని మలుపు తిరిగింది. ఇప్పటికే ఈ కేసు కారణంగా తెలంగాణ అడ్వొకెట్ జనరల్ దేశాయి ప్రకాష్ రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన రాజీనామా వ్యవహారం తెలంగాణ సర్కారుకు తలనొప్పి తీసుకు రాగా.. ఇప్పుడు మరో తలనొప్పి మొదలయ్యేలా ఉంది. అదేమంటే అసెంబ్లీలో ఈనెల 12వ తేదీన జరిగిన పరిణామాల వీడియో పుటేజీ ఇవ్వాల్సిందే అని హైకోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ వీడియో పుటేజీ ఇవ్వకపోతే అందులోని అంశాలు వ్యతిరేకంగా ఉన్నట్లే న్యాయస్థానం భావంచాల్సి వస్తదని హెచ్చరించింది. అలాంటప్పుడు మధ్యంతర ఉత్తర్వులు అలాగే ఇవ్వాల్సివస్తుందని తేటతెల్లం చేసింది. దీంతో తెలంగాణ సర్కారు మరో ఇరకాటంలో పడిపోయింది.

అసెంబ్లీలో ఇద్దరు కాంగ్రెస్ శాసనసభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ సభ్యత్వర రద్దు అంశం మంగళవారం హైకోర్టులో విచారన జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టులో ప్రభుత్వం తరుపున అడిషనల్ అడ్వొకెట్ జనరల్ రామచంద్రారావు హాజరయ్యారు. అయితే ఈ కేసు విచారణ మంగళవారం ఉదయమే ఉండగా.. విచారణకు సర్కారు తరుపున న్యాయవాదులెవరూ హాజరు కాలేదు. దీంతో కేసును మధ్యాహ్నం రెండున్నరకు జడ్జీ శివశంకర్ రావు వాయిదా వేశారు.

మధ్యాహ్నం విచారణకు అడిషనల్ అడ్వొకెట్ జనరల్ రామచంద్రారావు కేసుకు ప్రభుత్వం తరుపున హాజరయ్యారు. అయితే తాను న్యాయశాఖ తరుపునే హాజరైనట్లు చెప్పారు. అసెంబ్లీ తరుపున కాదన్నారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో ఇస్తామన్న వీడియో పుటేజీ ఇవ్వాల్సిందే అని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. ఒకవేళ వీడియో పుటేజీ ఇవ్వకపోతే అందులో సర్కారుకు వ్యతిరేకంగా ఉందన్న కోణంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని హెచ్చరించారు.

వీడియో పుటేజీతోపాటు కౌంటర్ దాఖలు చేయడానికి మరో నాలుగు వారాల గడువు కావాలని ఎఎజె రామచంద్రారావు న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. కానీ న్యాయమూర్తి అంగీకరించలేదు. ఇప్పటికే ఇవ్వాల్సిన సమయం ఇచ్చామని విధిగా ఏప్రిల్ 3వ తేదీ వరకు వీడియో పుటేజీ ఇవ్వాలని, కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కేసును ఏప్రిల్ 3వ తేదీకి వాయిదా వేశారు.

అయితే ఈ కేసులో ప్రభుత్వం తరుపున వాదన బలహీనంగా ఉందన్న ప్రచారం ఉంది. ఇప్పటివరకు కేవలం కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెడ్ ఫోన్స్ విసిరినట్లు మాత్రమే వీడియో పుటేజీ బయటకు వదిలారు. కానీ శాసనమండలి ఛైర్మన్ కంటికి గాయమైందని చూపే పుటేజీ ఇంతవరకు బయటకు వదలలేదు. పైగా గొడవ తర్వాత జాతీయ గీతం పాడిన సమయంలో గవర్నర్ పక్కన స్వామి గౌడ్ చాలా ప్రశాంతంగా కనిపించారని కాంగ్రెస్ వాదిస్తోంది. ఆ తర్వాత సభ వాయిదా వేశారని అప్పుడు శాసనమండలి ఛైర్మన్ ప్రశాంతంగా బయటకు వెళ్లిపోయారని కాంగ్రెస్ వాదన. మరి ఆ సమయంలో స్వామి గౌడ్ కంటికి ఎలాంటి గాయం కాలేదని కాంగ్రెస్ వాదిస్తోంది. కేవలం ఇద్దరు సభ్యులపై వేటు వేసేందుకే స్వామి గౌడ్ కంటికి గాయమైందని ప్రభుత్వం డ్రామా చేసిందని పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ముందునుంచీ వాదిస్తూనే ఉన్నారు. ఒకవేళ గాయమైతే వీడియో పుటేజీ చూపాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios