మాజీ పీసీసీ చీఫ్ , నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన వ్యవహారంపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. యూత్ కాంగ్రెస్ వార్ రూమ్ ఇన్‌ఛార్జ్ ప్రశాంత్‌పై వేటు వేసింది.
తెలంగాణలో యూత్ కాంగ్రెస్ వార్ రూమ్‌పై పోలీసులు దాడి చేసిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. మాజీ పీసీసీ చీఫ్ , నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన వ్యవహారంపై రంగంలోకి దిగిన పోలీసులు.. వార్ రూమ్‌పై దాడి చేసి కంప్యూటర్లు, హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే సొంత పార్టీకి చెందిన వారిపై ట్రోలింగ్ చేసినందుకు అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. యూత్ కాంగ్రెస్ వార్ రూమ్ ఇన్‌ఛార్జ్ ప్రశాంత్‌పై వేటు వేసింది. అతనిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ప్రశాంత్‌తో పాటు మరో నలుగురిపై పోలీసులు ఐపీసీ 154, 157 సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడంతో పాటు రేపు విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
కాగా గత కొంతకాలంగా ఉత్తమ్‌తో పాటు భట్టి విక్రమార్క, వీ హనుమంతరావు, జగ్గారెడ్డి తదితర సీనియర్లపై ట్రోలింగ్ నడుస్తోంది. దీంతో మే 5న ఉత్తమ్ కుమార్ రెడ్డి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ నెంబర్ నుంచి తనపై పదే పదే ట్రోలింగ్ జరుగుతోందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ నెంబర్ ఆధారంగా కూపీ లాగారు. ఉత్తమ్ ఇంటికి సమీపంలోని ఫ్లాట్ నుంచి ట్రోలింగ్ జరుగుతున్నట్లుగా గుర్తించి సోమవారం రాత్రి సోదాలు నిర్వహించారు. సదరు ఫ్లాట్ యూత్ కాంగ్రెస్ పేరుతో వున్నట్లు గుర్తించిన పోలీసులు.. అక్కడి నుంచి కంప్యూటర్లు, హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు.
అయితే సొంత పార్టీ నేతలపై ట్రోలింగ్ జరుగుతుండటం తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే దీనికి తమకు సంబంధం లేదని యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనా రెడ్డి చెప్పారు. దీనికి పాల్పడిన వారు ఎవరో తేల్చాలని ఆయన పోలీసులను కోరారు. అయితే యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా హ్యాండిల్ హ్యాకైందా అన్న అనుమానాలను ఆయన వ్యక్తం చేశారు.
