కషాయిరంగు జెండా కప్పుకున్న మాధవీలత

నచ్చావులే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన ప్రముఖ సినీ నటి, హీరోయిన్‌ మాధవీ లత భారతీయ జనతా పార్టీలో చేరారు. శనివారం పార్టీ సీనియర్‌ నాయకుడు బండారు దత్తాత్రేయ, నితిన్‌ గట్కరీ సమక్షంలో ఆమె బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. మాధవీలత గత కొద్ది కాలంగా టాలీవుడ్‌లో చెలరేగుతున్న వివాదాలపై తరచూ తన గొంతు వినిపించారు. గతంలో పవన్‌ పార్టీ జనసేన తరపున సైతం ప్రచారం చేస్తానని చెప్పిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇటీవల జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌పై నటి శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మాధవీ లత ఫిలిం ఛాంబర్‌ వద్ద నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో గత కొద్దికాలంగా మాధవీ లత జనసేనలో చేరబోతున్నారంటూ వార్తలు సైతం హల్‌చల్‌ చేశాయి. అయితే ఆమె అనూహ్యంగా శనివారం బీజేపీలో చేరారు.