హైదరాబాద్: విప్లవ రచయిత వరవరరావును మహారాష్ట్ర పోలీసులు మంగళవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయన అరెస్టుతో తీవ్రంగా కలత చెందిన ఆయన భార్య హేమలత కంట తడి పెట్టుకున్నారు. 

యాభై ఏళ్లుగా అరెస్టులు చేస్తున్నారని, 25 కేసులు పెట్టారని,  తప్పుడు కేసులన్ని కోర్టులో వీగిపోయాయని ఆమె అన్నారు. ఇంట్లో అణువణువు గాలించారని, తమ కూతుళ్ల ఇళ్లలో కూడా సోదాలు చేశారని అన్నారు. అరెస్టులు మాకు కొత్త కాదని అన్నారు.
 
"70 ఏళ్ల మనిషి.. అనారోగ్యంతో బాధపడుతున్నడు" అని కన్నీళ్లు తుడుచుకుంటూ అక్కడ ఎలాంటి ఇబ్బందులకు గురి చేస్తారో అని ఆవేదన వ్యక్తం చేశారు.  

రాత్రి 8 గంటలకు ఇంట్లోకి ప్రవేశించి ఫోన్లు లాక్కున్నారని జర్నలిస్టు క్రాంతి టేకుల అన్నారు. ఆయన ఇంట్లో సోదాలు జరిగిన విషయం తెలిసిందే. మహారాష్ట్ర నుంచి వచ్చి ఓ కాగితం చేతిలో పెట్టి 20మంది తెల్లవార్లు సోదాలు చేశారని అన్నారు. 
తన తల్లి హార్ట్ పేషెంట్ అని చూడకుండా చాలా ఇబ్బందులు పెట్టారని, ఎఫ్‌ఐఆర్‌లో పెరు లేకుండా తన ఇంట్లో సోదాలు చేశారని అన్నారు. తన వ్యక్తిగత సమాచారాన్ని మొత్తం లాగేసుకున్నారని అన్నారు.

మహారాష్ట్ర, తెలంగాణ పోలీసులు 5 గంటలపాటూ తమ ఇంట్లో చాలా ఇబ్బందులకు గురి చేశారని మరో జర్నలిస్టు కూర్మనాథ్ అన్నారు. ఆంధ్రపాలకుల సమయంలో ఇలాంటి దాడులు ఎన్నడూ చేయలేదని అన్నారు. ఇంట్లో ఉన్న విలువైన తమ వ్యక్తి గత సమాచారాన్ని ఎత్తుకెళ్లారని అన్నారు.

విరసం వ్యవస్థా పక సభ్యుడు, ప్రముఖ కవి  వర వర రావుని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ రేపు బుధవారం ఉదయం 11గంటలకు హైదరాబాదులోని అంబేడ్కర్ విగ్రహం నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు విరసం కార్యదర్శి పాణి, ఇతర సభ్యులు కాశీం, జగన్, రాంకీ, రాము, బాసిత్, వరలక్ష్మి, క్రాంతి, గీతాంజలి, అరసవిల్లి, కిరణ్ కుమార్, చిన్నయ్య తెలిపారు.  

కవులు, కళాకారులు, వామపక్ష వాదులు, ప్రజాస్వామిక వాదులు, రచయితలు అందరూ హాజరు కావాలని కోరుతున్నట్లు వారు తెలిపారు.