ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి.
ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. జలాశయాలకు భారీగా వదర నీరు వచ్చి చేరుతుంది. ఇప్పటికే తెలంగాణలోని అనేక ప్రాంతాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మంచిర్యాల, కొత్తగూడెం, కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
నిజామాబాద్‌లో లింగి తండాలోని నెమలి తండా గుట్ట వద్ద వాగు దాటుతుండగా ఇద్దరు పశువుల కాపర్లు బలమైన ప్రవాహంలో కొట్టుకుపోయారు. వారిని మేకల నాడి సాయిలు, దారంగుల రెడ్డిగా గుర్తించారు. భారీ వర్షాలకు జిల్లాలో 18 ఇళ్లు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. మంథని- కాటారం మార్గంలో కొండంపేట వాగు ఉద్ధృతంగా ప్రవాహిస్తుంది. దీంతో కొయ్యూరు వద్ద ప్రధాన రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. నిర్మల్ జిల్లా కిషన్‌రావుపేటలో చెరువుకు గండి పడింది. భారీ వర్షాల కురుస్తుండటంతో సింగరేణిలోని ఉపరిత గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.
నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వస్తుంది. దీంతో అధికారులు 100 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 49 టీఎంసీల నీరు ఉంది. ఇక, పెద్దపల్లి జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. దీంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పార్వతీ బ్యారేజ్‌కు వరద ఉద్ధృతి పెరగడంతో గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు కూడా భారీగా వరద వచ్చి చేరుతుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయింది. సంబంధిత శాఖలను అప్రమత్తం చేయాలని, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు తమతమ ప్రాంతాల్లోనే ఉండి సహాయక చర్యలకు సహకరించాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని కేసీఆర్ కోరారు.
మరో రెండు రోజులు ఇదే పరిస్థితి..
రాష్ట్రంలో మరో రెండు రోజులు పాటు వర్షాలు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజుల్లో తెలంగాణలో చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈశాన్య, వాయువ్య జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అయితే కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం అధికారులు సూచించారు.
హైదరాబాద్‌లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై చేరిన నీటిని, రోడ్లపై పడిన చెట్ల కొమ్మలను తొలగించేందుకు జీహెచ్‌ఎంసీ మాన్‌సూన్ టీమ్‌లు, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిబ్బందిని రంగంలోకి దించారు. హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి, జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
