Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో వర్ష బీభత్సం.. ఈదురుగాలుతో పెరిగిన చలి తీవ్రత.. ఆ జిల్లాల్లో మరో రెండు రోజు వర్షాలు..

తెలంగాణలో వర్షాలు (Rains In Telangana) దంచికొడుతున్నాయి. మంగళవారం హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షం (heavy rain) కురిసింది. మరో రెండు రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

Heavy rains in telangana likely to receive rainfall next 2 days
Author
Hyderabad, First Published Jan 12, 2022, 10:20 AM IST

తెలంగాణలో వర్షాలు (Rains In Telangana) దంచికొడుతున్నాయి. మంగళవారం హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షం (heavy rain) కురిసింది. మరో రెండు రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణలోకి బలంగా గాలులు వీస్తున్నాయని ఈ ప్రభావంతో వర్షాలు కురుస్తున్నట్టుగా వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ ప్రభావంతో కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే చాన్స్ ఉందని అంచనా వేశారు. 

మంగళవారం రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షం జనజీవనాన్ని స్తంభింపజేసింది. వడగళ్ల వానలు కొన్ని ప్రాంతాలను ముంచెత్తాయి. ఈ కారణంగా పలు ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి. గత 24 గంటల్లో సిద్దిపేట జిల్లా చిన్నకొడూరులో అత్యధికంగా 85.2 మి.మీ వర్షపాతం నమోదైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వర్ష బీభత్సం కొనసాగింది. మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు కరీంనగర్‌‌లోని శంకరపట్నంలో 60.8 మి.మీ, మానుకొండూరులో 56.8 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇక, నిర్మల్, కొమురంభీం ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ  వర్షం కురిసింది. 

హైదరాబాద్‌లో కూడా మంగళవారం భారీ వర్షం కురిసింది. బొల్లారం, తిరుమలగిరి, కార్ఖానతో పాటు కుషాయిగూడ, సైనిక్‌పురి, మౌలాలి, చర్లపల్లి, బేగంపేట, చిలకగూడ ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. దీంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. 

రానున్న రెండు రోజుల్లో.. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, జయశంకర్-భూపాలపల్లి,  ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. 

కరీంనగర్‌లో కూలిన భారీ కటౌట్.. 
కరీంనగర్ నగరంలో మంగళవారం వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. నగరంలోని గీతాభవన్ చౌరస్తాలో వేంకటేశ్వర స్వామి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కొద్ది రోజుల క్రితం ఏర్పాటు చేసిన 70 అడుగుల ఎత్తైన విద్యుత్ దీపాల అలంకరణ లుమినార్ కూలిపోయింది. పట్టాభిషేకాన్ని ఆవిష్కరించేలా సుమారు రూ. 45 లక్షలు వెచ్చించి ఈ భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. అయితే గాలుల ధాటికి భారీ కటౌట్‌ నెలకొరిగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios