తెలంగాణ మరో రెండ్రోజులు భారీ వర్షాలు... నేడు,రేపు ఆ జిల్లాల్లో హైఅలర్ట్
గత వారంరోజులుగా తెలంగాణ రాష్ట్రాన్ని ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలు ముంచెత్తగా మరో రెండ్రోజులు ఇలాగే వర్షాలు కొనసాగే అవకాశం వుందని వాతావరణ శాఖ ప్రకటించింది.
హైదరాబాద్ : గతవారం రోజులుగా తెలుగురాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. తెలంగాణలో అయితే రాజధాని హైదరాబాద్ తో పాటు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. మరో రెండురోజులు అంటే ఆదివారం, సోమవారం కూడా తెలంగాణలో భారీ వర్షాలు కొనసాగే అవకాశం వుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీంతో ప్రభుత్వ యంత్రాంగంతో పాటు ప్రజలు అప్రమత్తం అయ్యారు.
ఈ రెండురోజులు రుతుపవనాల ప్రభావంతో ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు, అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, జనగాం, వరంగల్ రూరల్, మహబూబాబాద్, ఆసిఫాబాద్,మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని తెలిపారు. ఇక సోమవారం అంటే రేపు భూపాలపల్లి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, సిరిసిల్ల, నిజామాబాద్, జగిత్యాల, ములుగు, పెద్దపల్లి, ములుగు జిల్లాలో వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. మిగతా జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఇక ఇప్పటికే తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో నదులు, వాగులు వంకలు ప్రమాదకరంగా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరద నీటితో ప్రాజెక్టులు, జలాశయాలు, చెరువులు నిండుకుండల్లా మారి ప్రమాదకరంగా మారాయి. ఇలా నిర్మల్ జిల్లాలో కడెం ప్రాజెక్ట్ కు భారీ వరదనీరు చేరి ప్రమాద ఘంటికలు మోగించింది. కానీ ఎలాంటి ప్రమాదం జరగకుండానే వరద ప్రవాహం తగ్గడంతో స్థానిక ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
read more భద్రాచలంలో వరద బాధితుల ఆందోళన.. కరకట్ట పొడిగించాలని డిమాండ్.. మద్దతు తెలిపిన ఎమ్మెల్యే పొదెం వీరయ్య
ఇక ఎగువన మహారాష్ట్రతో పాటు తెలంగాణలోనూ అతిభారీ వర్షాలు కురవడంతో గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో భద్రాచలం వద్ద గోదావరి మహోగ్రరూపం దాల్చి రికార్డ్ స్థాయిలో వరదనీటితో ప్రవహించింది. దీంతో గత నాలుగైదు రోజులుగా భద్రాచలంలో ఆందోళన నెలకొంది. గంటకు గంటకు గోదావరిలో వరద నీరు పెరగడం ఆందోళనకు గురిచేసింది.
ఒకానొక సమయంలో గోదావరి నీటిమట్టం గరిష్టంగా 71.30 అడుగులకు చేరింది. దీంతో నీరు క భద్రాచలంలోని లోతట్టు ప్రాంతాలు వరదనీటిలో మునిగిపోయాయి. కొత్త కాలనీ, అయ్యప్ప కాలనీ, సుభాష్ నగర్ కాలనీ, అశోక్ నగర్, శాంతి నగర్ కాలనీ, రామాలయం ప్రాంతంలోని ఇళ్లలోకి నీరు చేరింది. దీంతో కరకట్ట పొడిగించి భవిష్యత్ లో ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూడాలని మునకకు గురయిన కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు.
అయితే ప్రస్తుతం గోదావరిలో వరద ఉధృతి క్రమంగా తగ్గుముఖం పడుతుంది. గత రెండ్రోజులుగా ఎగువన వర్షాలు కాస్త తగ్గుముకం పట్టడంతో గోదావరి నదికి వరద ప్రవాహం తగ్గింది. దీంతో గత నాలుగైదు రోజులుగా భద్రాచలంలో నెలకొన్న ఆందోళనకు తెరపడింది. ప్రస్తుతం భద్రాచంలో మూడో ప్రమాద హెచ్చరిక (53 అడుగుల నీటి మట్టం వద్ద) కొనసాగుతూ ఉంది.
మరోసారి తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం వుందన్న హెచ్చరికల నేపథ్యంలో మరోసారి ఆందోళన నెలకొంది. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా వుండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.