భద్రాచలంలో వరద బాధితుల ఆందోళన.. కరకట్ట పొడిగించాలని డిమాండ్.. మద్దతు తెలిపిన ఎమ్మెల్యే పొదెం వీరయ్య
భ్రద్రాచలంలో గోదావరికి వరద ఉధృతి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో భద్రాచలంలోని పలు కాలనీలు వరదలో మునిగిపోయాయి. దీంతో వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. అయితే తమ సమస్యలను పరిష్కారించాలని సుభాష్ నగర్ కాలనీ వరద బాధితులు ఆందోళనకు దిగారు.
భ్రద్రాచలంలో గోదావరికి వరద ఉధృతి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో భద్రాచలంలోని పలు కాలనీలు వరదలో మునిగిపోయాయి. కొత్త కాలనీ, అయ్యప్ప కాలనీ, సుభాష్ నగర్ కాలనీ, అశోక్ నగర్, శాంతి నగర్ కాలనీ, రామాలయం ప్రాంతంలోని ఇళ్లలోకి నీరు చేరింది. దీంతో ఆ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నవారిని పునరావాస కేంద్రాలకు తరలించారు. భద్రాచలం, బూర్గంపాడు మండలాల్లో 144 సెక్షన్ విధించారు. అయితే భద్రాచలంలో వరద బాధితులు ఆందోళనకు దిగుతున్నారు. శనివారం ఉదయం సుభాష్ నగర్ కాలనీ వరద బాధితులు ఆందోళనకు దిగారు. సుభాష్ నగర్ వరకు కరకట్ట పొడిగించాలని డిమాండ్ చేస్తున్నారు.
గోదావరి వరదలతో 2 వేల కటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత భారీగా వరదలు వస్తాయని అధికారులు ముందే హెచ్చరించలేదని వారు చెబుతున్నారు. తాము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. కరకట్ట పొడిగింపుపై హామీ ఇచ్చే వరకు ఆందోళన చేస్తామని చెప్పారు. ఎంపీకి, మంత్రికి తమ ఆందోళన కనిపించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు.
ఆందోళన నిర్వహిస్తున్న సుభాష్ నగర్ వాసులతో అధికారులు చర్చలు జరుపుతున్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని ఆర్డీవో చెబుతున్నారు. అయితే కలెక్టర్, మంత్రి వచ్చే వరకు తమ నిరసనను కొనసాగిస్తామని వరద బాధితులు చెబుతున్నారు.
ఈ విషయం తెలుసుకున్న భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య అక్కడికి చేరుకుని ఆందోళనకారులకు మద్దతు తెలిపారు. బాధితులతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. వరద బాధితుల సమస్యను సీఎం కేసీఆర్ పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బాధితులు కోరుతున్నట్టుగా కరకట్టను పొడిగించాలని కోరారు. అయితే పొదెం వీరయ్య అక్కడి రావడంతో.. టీఆర్ఎస్ శ్రేణులు కూడా అక్కడికి చేరుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
ఇదిలా ఉంటే అయ్యప్ప కాలనీ ప్రజలు కూడా శుక్రవారం ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. flood bankకు సమీపంలో పంప్‌హౌస్ నుంచి లీకేజీని అరికట్టేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వరద ఒడ్డున ఉన్న తూముల లీకేజీని అరికట్టడంలో యంత్రాంగం విఫలమైందని ఆరోపించారు. మరమ్మత్తు పనులు చేపట్టకపోవడం వల్ల వరదనీరు పట్టణానికి పెను ప్రమాదంగా మారింని వారు చెప్పారు.