హైద్రాబాద్ సరూర్‌నగర్  కోదండరామనగర్ లో వరద నీటిలో అంబులెన్స్ చిక్కుకోవడంతో ఓ మహిళ మరణించింది. గుండెపోటు రావడంతో అంబులెన్స్ పిలిచినా ఆ కుటుంబానికి ఫలితం దక్కలేదు.వర్షం తగ్గినా వరద తగ్గకపోవడంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా ఆ కుటుంబం ఇబ్బంది పడుతుంది.

హైదరాబాద్: హైద్రాబాద్ సరూర్‌నగర్ కోదండనగర్‌లో వరద నీటిలో అంబులెన్స్ చిక్కుకుపోవడంతో ఓ మహిళ మృతి చెందింది.గురువారం నాడు సాయంత్రం హైద్రాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది.ఈ వర్షంతో సరూర్ నగర్ చెరువు నుండి కోదండరామునగర్‌లో వరద నీరు ముంచెత్తింది.

మళ్లీ వరదతో తమ ఇంటిని ముంచెత్తుతోందనే ఆవేదన కారణంగా ఓ మహిళకు గుండెపోటు వచ్చింది. వెంటనే కుటుంబసభ్యులు అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్ వరద నీటిలో చిక్కుకుపోయింది. బాధితురాలి ఇంటి వద్దకు అంబులెన్స్ చేరలేదు.

అయితే స్ట్రెచర్ పై బాధితురాలిని అంబులెన్స్ వద్దకు తీసుకొచ్చారు ఈ లోపుగానే బాధితురాలు మరణించింది. ఈ ఘటన ఆ కుటుంబంలో విషాదం నింపింది.హైద్రాబాద్ నగరంలో వర్షం కురిస్తే సరూర్ నగర్ చెరువు కింద ఉన్న కోదండరామనగర్‌, వివేకానంద నగర్ తదితర కాలనీలను వర్షపు నీరు ముంచెత్తుతుంది. వర్షం వస్తే ఈ కాలనీ వాసులు భయంతో గడుపుతున్నారు.