హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ స్టేడియంలో పెను ప్రమాదం తప్పింది. సోమవారం రాత్రి నగరంలో భారీగా వర్షం కురిసిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు, బ్యానర్లు, షెడ్స్ కుప్పకూలాయి. ఉప్పల్ స్టేడియంలో సౌత్ పెవీలియన్ బైలాక్‌లో పెనుగాలులకు షెడ్డు, ఓ ఎల్ఈడీ కుప్పకూలాయి. 

ఈదురు గాలులు తాకిడికి ఎనభై శాతం సౌత్ పెవీలియన్ దెబ్బతిన్నది. అయితే ఐపీఎల్ మ్యాచ్ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన జరిగినప్పుడు జనాలు ఎవరూ లేకపోవడంతో సిబ్బంది ఊపిరిపీల్చుకుంది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉండగా.. రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షానికి ఎన్టీఆర్ స్టేడియంలో ఎగ్జిబిషన్ షెడ్స్, ఎల్బీ స్టేడియంలో ఫ్లడ్ లైట్ టవర్ కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఒకరి మృతి చెందగా పలువురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.