తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలు వాతావరణాన్ని చల్లబర్చినా రైతులకు భారీ పంట నష్టాన్ని మిగిలిస్తున్నాయి. గురువారం రాత్రి నుండి భారీ ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన వర్షం కురుస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం కూడా పలు ప్రాంతాల్లో చిన్న గులకరాళ్ల సైజులోని వడగళ్లతో కూడిన వర్షం కురిసింది. ఈ వడగళ్ల దాటికి చేతికందివచ్చిన మామిడి పంటతో పాటు వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. 

సిద్దిపేట జిల్లా ములుగు, గజ్వేల్‌,హుస్నాబాద్ మండలాల్లో ఈ వర్షం బీభత్సం మరీ ఎక్కువగా వుంది. అలాగే హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్‌, ఆరాంఘర్‌‌‌, శివరాంపల్లి, శంషాబాద్‌, గగన్‌పహడ్‌ తదితర ప్రాంతాల్లోకూడా వడగళ్ల వర్షం కురింసింది. అలాగే జగిత్యాల జిల్లాలోని పలు గ్రామాల్లో కూడా వడగళ్లు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసినట్లు సమాచారం. 

ఇక హైదరాబాద్ లోని  ఎల్బీనగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌ లలో భారీ వర్షం పడింది. వర్షంతో రహదారులపై భారీగా వరదనీరు నిలిచిపోయింది.  రోడ్లపై వరదనీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌ సమస్యలు నెలకొన్నాయి. నగరంలోని మిగతా చోట్ల సన్నని చినుకులతో కూడిన వర్షం వాతావరణాన్ని చల్లబర్చింది.  

ఈ అకాల వర్షం కారణంగా ప్రధానంగా ఉద్యానవన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మామిడి కాయలు రాలిపోవడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ వర్షాల వల్ల జరిగిన పంట నష్టంపై వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి స్పందించారు.  మార్కెటింగ్‌, పౌరసరఫరాల శాఖ అధికారులతో పాటు ప్రభుత్వ యంత్రాంగమంతా ఈ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు.  

వీడియో

"