తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది. ఇంటిగోడ కూలడంతో తెల్లవారుజామున నిద్రలోనే తల్లీకూతురు మృతిచెందారు.
నల్గొండ : తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది. నల్గొండ జిల్లాలో గత రాత్రి కురిసిన వర్షానికి ఇంటిగోడ కూలి తల్లీకూతురు మృతిచెందారు. ఈ దుర్ఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.
వివరాల్లోకి వెళితే... ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ కుటుంబం ఉపాధి కోసం నల్గొండకు వలసవచ్చి పద్మానగర్ లో నివాసముంటున్నారు. కొన్నేళ్లుగా ఇక్కడే రైల్వే కూలీలకు వంటచేసిపెడుతూ తద్వారా వచ్చే డబ్బులతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఇలా భార్యాభర్తలు కష్టపడి పనిచేస్తూ ఇటీవలే కూతురు పెళ్లి చేసారు.
అయితే కూతురు కళ్యాణి (21) పుట్టింటికి రావడంతో తల్లి నడికుడి లక్ష్మీ (42) ఇంట్లోనే వుంది. రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో ఇంట్లో పడుకునివున్న తల్లీకూతుళ్లు ప్రమాదానికి గురయ్యారు. వర్షపు నీటితో ఇంటి గోడ బాగా తడిసి ఇవాళ తెల్లవారుజామున ఒక్కసారిగా బీరువాపై కుప్పకూలింది. దీంతో బీరువా ఇంట్లో పడుకున్న తల్లీకూతుళ్లపై పడటంతో దుర్మరణం చెందారు.
read more మహబూబ్‌నగర్‌లో వరద నీటిలో చిక్కుకున్న స్కూల్ బస్సు: 25 మందిని కాపాడిన స్థానికులు
ఇదిలావుంటే తెలంగాణలో మరో రెండురోజుల పాటు భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ, రేపు (శుక్ర, శని) హైదరాబాద్ లో అతి భారీ వర్షం కురవొచ్చని... నగరవాసులు అప్రమత్తంగా వుండాలని హెచ్చరించారు. ఈ రెండురోజుల్లో 64 నుండి 114 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావచ్చని అంచనా వేసారు.
ఇక తెలంగాణలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ (204మిమీ కంటే ఎక్కువ వర్షపాతం), మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్డ్ (115 నుండి 204 మిమీ) ప్రకటించారు. మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలుండటంతో రెడ్ అలర్డ్... సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి, కామారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించారు. మిగతా జిల్లాల్లోనూ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురియవచ్చని హెచ్చరించారు.
ఇదిలావుంటే మహబూబ్ నగర్ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. రామచంద్రాపురం నుంచి సుగూరు తండాకు విద్యార్థులతో వెళుతున్న స్కూల్ బస్సు వరదనీటిలో చిక్కుకుంది. కొడూరు - మాచన్ పల్లి మధ్యలో అండర్ బ్రిడ్జి కింద వరదనీరు నిలిచిపోవడంతో బస్సు అందులో చిక్కుకుంది. వెంటనే స్థానికులు స్పందించి బస్సులోని విద్యార్థులను దించడంతో ప్రమాదం తప్పింది.
ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని తల్లీ కూతుళ్ల మృతదేహాను ఏరియా హాస్పిటల్ కు తరలించారు. ఇలా గోడ కూలి తల్లికూతురు మృతిచెందడంతో నల్గొండ పట్టణంలో విషాదం నెలకొంది.
