భారీ వర్ష సూచన.. హైదరాబాద్ సహా పలు ప్రాంతాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్
Hyderabad: అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సాధారణం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే, నేడు కూడా హైదరాబాద్ సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరిస్తూ ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
Telangana rains: అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సాధారణం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే, నేడు కూడా హైదరాబాద్ సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరిస్తూ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. కాగా, పోయిన గురువారం అర్థరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తెలంగాణలో నలుగురు మృతి చెందారు.
వివరాల్లోకెళ్తే.. హైదరాబాద్ నగరంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతున్నాయి. అయితే, నగరంలో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నగరంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. హైదరాబాద్ లోని చార్మినార్, ఖైరతాబాద్, కూకట్ పల్లి, ఎల్బీనగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి జోన్లలో ఈ నెల 28 వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. కచ్చితమైన అంచనాలకు పేరుగాంచిన ప్రముఖ వాతావరణ నిపుణుడు టి.బాలాజీ కూడా సాయంత్రం లేదా రాత్రి హైదరాబాద్ లో వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు.
తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TSDPS) డేటా ప్రకారం, నిన్న నగరంలో సాయంత్రం వర్షం కురిసింది. బండ్లగూడలో అత్యధికంగా 12 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రస్తుత రుతుపవనాల సీజన్‌లో తెలంగాణలో సాధారణ వర్షపాతం 717.3 మిల్లీమీటర్లు దాటి 840.1 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లో సాధారణ వర్షపాతం 589.5 మిల్లీమీటర్ల కంటే 724.1 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది.
ఇదిలావుండగా, పోయిన గురువారం నుంచి తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం అర్థరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నలుగురు మృతి చెందారు. హనుమకొండలో భవనం కూలి ముగ్గురు మృతి చెందగా , మహబూబాబాద్‌లోని మున్నేరు వాగులో నీటి ఉధృతి పెరగడంతో ఓ వ్యక్తి కొట్టుకుపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండలోని శాయంపేట గ్రామానికి చెందిన ఎం.పెద్ద సాంబయ్య, ఎల్.సారమ్మ, బి.జోగమ్మ ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా భవనం కూలింది. భారీ వర్షం కారణంగా దారిలో ఉన్న శిథిలావస్థలో ఉన్న కట్టడం వారిపై కూలిపోయి అక్కడికక్కడే మృతి చెందినట్లు శాయంపేట సబ్ ఇన్‌స్పెక్టర్ డి దేవేందర్ తెలిపారు. పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం పర్కల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.