హైదరాబాద్: హైదరాబాద్ లో పురాతన భవనం ఒక్కసారిగా పేకమేడలా కుప్పకూలిపోయింది. గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ధాటికి ఘోషామహాల్ లో ఓ పురాతన భవనం కుప్పకూలిపోయింది. 

పురాతన భవనంలో ఉంటున్న కుటుంబ శ్రీశైలం,పెంటమ్మ కుటుంబ సభ్యులు బుధవారం గోడకు పగుళ్లు రావడం గమనించి ఖాళీ చేశారు. ఇల్లు ఖాళీ చేసిన 24 గంటలు గడవకముందే ఇళ్లు కుప్పకూలిపోయింది. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. 

ఇకపోతే భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో పక్కనే ఉన్న ఇళ్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. భవనాన్ని పరిశీలించారు. 

పురాతన భవనాల్లో ఎవరూ ఉండొద్దని సూచించారు. త్వరలోనే పురాతన భవనాలను గుర్తించి వాటిపై చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. కుప్పకూలిన భవనం సుమారు 60 ఏళ్ల క్రితం నిర్మించినట్లు అధికారులు గుర్తించారు.