తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం, ద్రోణి ప్ర‌భావంతో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉందని పేర్కొంది.

తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం, ద్రోణి ప్ర‌భావంతో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలో రాగ‌ల 4 వారాల పాటు వ‌ర్షాలు స‌మృద్ధిగా కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. రానున్న మూడు రోజుల పాటు ఈశాన్య‌, ఉత్త‌ర తెలంగాణ జిల్లాల‌కు వాతావ‌ర‌ణ శాఖ రెడ్ అల‌ర్ట్ జారీ చేసింది. ఆ జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులుతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 

వాతావరణ శాఖ తాజా బులిటెన్ ప్రకారం.. ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రేపు ఉదయం 8.30 గంటల వరకు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 

ఇక, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, నిజామాబాద్, ములుగు, నల్గొండ, జనగామ, సిద్దిపేట, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్‌ నగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఈ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రేపు ఉదయం 8.30 గంటల వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం, యదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీచేసింది. ఈ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో రేపు ఉదయం 8.30 గంటల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 

Scroll to load tweet…

మ‌రో మూడు రోజుల పాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించిన నేప‌థ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని అప్ర‌మ‌త్తం చేసింది. ఎగువ నుంచి గోదావ‌రిలోకి భారీ వ‌ర‌ద వ‌చ్చే అవ‌కాశం ఉండటంతో.. గోదావ‌రి ప‌రివాహ‌క జిల్లాల‌కు చెందిన మంత్రుల‌ను, ఎమ్మెల్యేల‌ను అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రాణ‌, ఆస్తి న‌ష్టం జ‌ర‌గ‌కుండా ఉండాల‌ని సీఎం చెప్పారు.

ఇదిలా ఉంటే శుక్రవారం గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి మెదక్, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. 24 గంటల వ్యవధిలో మెదక్‌లోని పర్హూరు మండలంలో అత్యధికంగా 26.7 సెం.మీ, జనగాంలోని దేవరుప్పులలో 25.5 సెం.మీ, మెదక్‌లోని రాజపల్లిలో 23.7 సెం.మీ వర్షపాతం నమోదైంది.

కొద్ది రోజుల క్రితం వారం రోజులు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలపై ఈ ప్రభావం ఎక్కువ ఉంది. అయితే ఆ పరిస్థితులను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో మరోసారి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరికొద్ది రోజులు పరిస్థితి ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.