హైద్రాబాద్ జంట జలాశయాలకు భారీగా వరద నీరు: పూర్తి స్థాయిలో నిండిన హుస్సేన్ సాగర్
భారీ వర్షాల కారణంగా హైద్రాబాద్ లోని జంట జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తారు. గండిపేటకు కూడ భారీగా వరద వచ్చి చేరుతుంది.
హైదరాబాద్: నగరంలోని జంట జలాశయాలకు భారీగా వరద వచ్చి చేరుతుంది. దీంతో జంట జలాశయాల పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
సోమవారం నాడు సాయంత్రం హైద్రాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. ఈ వర్షం కారణంగా జంట జలాశయాలకు భారీ వరద వచ్చి చేరుతుందని నీటిపారుదల శాఖాధికారులు తెలిపారు.హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1763.50 అడుగులు. పూర్తి స్థాయిలో హిమాయత్ సాగర్ నిండిపోయింది. దీంతో హిమాయత్ సాగర్ నాలుగు గేట్లు ఎత్తి 2750 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.హిమాయత్ సాగర్ కు 1200 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. అయితే హిమాయత్ సాగర్ నుండి 1340 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
మరోవైపు గండిపేట (ఉస్మాన్ సాగర్)జలాశయానికి కూడ భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. గండిపేట పూర్తిస్థాయి నీటి మట్టం 1790 అడుగులు. గండిపేటలో ప్రస్తుతం 1786.10 అడుగులకు నీరు చేరుకుంది. ఎగువన నుండి భారీగా వరద నీరు వస్తుండడంతో గండిపేట జలాశయం నిండుకుండలా మారింది. మరో వైపు హుస్సేన్ సాగర్ కు కూడ భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. హుస్సేన్ సాగర్ పూర్తిగా నిండింది. దీంతో హుస్సేన్ సాగర్ కు వచ్చిన నీటిని వచ్చినట్టే దిగువకు విడుదల చేస్తున్నారు. హుస్సేన్ సాగర్ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.