Heatwave hits: రాష్ట్రంలో వేడి గాలుల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఇండ్లల్లోనే ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఎండల ప్రభావంతో వడదెబ్బ బారినపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంటున్నారు.
Heatwave hits: తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. క్రమంగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. దీంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావడానికి భయపడిపోతున్నారు. ఇక రాష్ట్రలో ఎండల తీవ్రత పెరుగుదల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ క్రమంలోనే ఓఆర్‌ఎస్, ఫ్లూయిడ్స్, గ్లూకోజ్ తదితర నిత్యావసరాలను తగిన పరిమాణంలో నిల్వ ఉంచుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖలు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు రాష్ట్రంలో విపరీతమైన ఎండల తీవ్రత, ప్రస్తుత వాతావరణం ప్రభావం నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలోని అన్ని ప్రథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ), సబ్‌సెంటర్లు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో ఒఆర్‌ఎస్, ఫ్లూయిడ్స్, గ్లూకోజ్, ఇతర నిత్యావసరాలను తగిన పరిమాణంలో నిల్వ ఉంచుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖలను ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు, ఆరోగ్య, విద్య, విపత్తు నిర్వహణ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో వడదెబ్బ లక్షణాలు, దాని పర్యవసానాలతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని అధికారులను సోమేశ్ కుమార్ ఆదేశించారు. ఎండల తీవ్రత పెరుగుతున్న క్రమంలో వృద్ధులు మరియు పిల్లలు ఇంట్లోనే ఉండాలని సూచించారు. పాఠశాలలను రోజు ముందుగానే మూసివేయాలని ఆదేశించారు.
పెరిగిన ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మార్చి 31 నుంచి ఏప్రిల్ 6 వరకు రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు ఉదయం 8.00 నుంచి 11.30 గంటల మధ్య పనిచేయాలని పాఠశాల విద్యా సంచాలకులు ఎస్. శ్రీనివాసాచారి బుధవారం ఆదేశాలు జారీ చేశారు. పరీక్షా కేంద్రాలు పరీక్షలకు హాజరయ్యే పిల్లలకు అన్ని సౌకర్యాలను అందించాలి, దానితో పాటు అన్ని సమయాలలో విద్యుత్ నిర్వహణ, ఆస్పత్రుల సేవలు, తాగునీరు మొదలైన క్లిష్టమైన సౌకర్యాలకు ప్రాధాన్యమివ్వాలని పేర్కొన్నారు. వడదెబ్బతో బాధపడే వ్యక్తులను ఆస్పత్రులకు తరలించేందుకు 108 అత్యవసర వాహనాలను ఏర్పాటు చేసి, అప్రమత్తంగా ఉండాలని, రోగికి తక్షణం మరియు అవసరమైన చికిత్సను అందించడానికి వీలుగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుదల క్రమంలో అగ్నిమాపక శాఖ కూడా అప్రమత్తమైంది. పంచాయతీ కార్యదర్శులు, ఇతర సంబంధిత అధికారులు మార్కెట్ యార్డులు, బస్ స్టేషన్లు తదితర ప్రాంతాల్లో నీటి సరఫరా కియోస్క్‌లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం పేర్కొంది. వేసవిలో చేయాల్సినవి, చేయకూడని వాటిపై గ్రామసభలు నిర్వహించి ముందస్తు కార్యాచరణ ప్రణాళికతో సిద్ధం చేయాలని కోరారు. ఎండల తీవ్రత కారణంగా మరణాలు సంభవించకుండా అన్ని చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. నీరు, మజ్జిగ సరఫరా కేంద్రాలను నడిపేందుకు స్వచ్ఛంద సంస్థలు కలిసి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
తెలంగాణలోనే కాకుండా దేశంలోని చాలా ప్రాంతాల్లో ప్రస్తుతం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అంతకుముందు తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ అండ్ ప్లానింగ్ సొసైటీ (TSDPS) ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా వచ్చే వారంలో ప్రధానంగా పొడి వాతావరణం ఉంటుంది. మొత్తం మీద సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రాష్ట్రం మీదుగా ఆగ్నేయ/తూర్పు గాలులు వీస్తున్నందున, రాబోయే 2 రోజుల్లో అనేక జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలలో గణనీయమైన మార్పు ఉండదని మరియు ఆ తర్వాత 2 నుండి 3 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉంది. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో 43 నుంచి 44 డిగ్రీల సెల్సియస్, హైదరాబాద్‌లో 40 నుంచి 41 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరం భీమ్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో వేడిగాలులు వీచే అవకాశం ఉంది.
