తెలుగు రాష్ట్రాల్లోని వాతావరణంలో విచిత్ర పరిస్ధితి కనిపిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఫణి తుఫాను కారణంగా కోస్తా, ఉత్తరాంధ్రలో బలమైన ఈదురుగాలులు, వర్షం కురుస్తుండగా.. తెలంగాణలో మాత్రం ఎండ చుక్కలు చూపిస్తోంది.

ముఖ్యంగా ఎండలకు తోడు వేడి గాలులు వీస్తుండటంతో జనం భయాందోళనలకు గురవుతున్నారు. ఉదయం 8 గంటలకే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో ప్రజలు అడుగు తీసి అడుగు బయటపెట్టాలంటే వణికిపోతున్నారు.

బుధవారం కూడా తెలంగాణలో వేడి గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, కామారెడ్డి, కరీంనగర్, నిర్మల్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కొమరం భీం జిల్లాల్లో అధ్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.

మంగళవారం ఆదిలాబాద్ అత్యధికంగా 45.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్‌లో 43.8, నల్గొండ 43.2, మెదక్ 42.8, భద్రాచలం, రామగుండంలో 42.6, హన్మకొండ 41.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపింది. అత్యవసర పరిస్ధితులు ఉంటే తప్పించి వీలైనంత వరకు బయటకు రాకుండా ఉండాలని ప్రజలను వాతావరణ శాఖ హెచ్చరించింది.