ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణానికి సంబంధించి తెలంగాణ సర్కార్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ వియజసేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది
ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణానికి సంబంధించి తెలంగాణ సర్కార్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ వియజసేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా నిర్మాణంపై ఏ నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. హెరిటేజ్ భవనం మినహా మిగతా బ్లాక్‌లలో నిర్మించలేరా ? అని ప్రశ్నించింది.
రాష్ట్ర ప్రభుత్వం అన్ని అంశాలను పరిశీలిస్తోందని.. నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం ఇవ్వాలని ఏజీ ప్రసాద్ న్యాయస్థానాన్ని కోరారు. నిర్ణయం తీసుకోవడానికి ఇంకా ఎన్నేళ్లు కావాలంటూ ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఈ విషయంలో ప్రభుత్వ తీరు సరిగా లేదని కోర్టు వ్యాఖ్యానించింది. ఆస్పత్రి సైట్ ప్లాన్, గూగుల్ మ్యాప్ ఎందుకు సమర్పించలేదని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.
Also Read:ఉస్మానియా ఆసుపత్రి బిల్డింగ్ చారిత్రకమైందా.. కాదా?: ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
ఈ అంశంలో వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిపై కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని ధర్మాసనం ప్రశ్నించింది. వైద్యారోగ్య శాఖ అధికారులు కరోనా నియంత్రణలో బిజీగా ఉన్నందున కొంత సమయం ఇవ్వాలని ఏజీ కోర్టును కోరారు. ఆస్పత్రి పూర్తిగా కూల్చి కొత్తగా నిర్మిస్తారా? లేక కొన్ని బ్లాక్‌లలో మాత్రమే నిర్మిస్తారా? అనే విషయాన్ని స్పష్టంగా చెప్పాలని న్యాయస్థానం నిలదీసింది. ఆస్పత్రి నిర్మాణంపై 6 వారాల్లో తుది నిర్ణయం తీసుకొని బ్లూప్రింట్ సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్ట్ ఆదేశించింది.
