హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆస్తుల కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 7వ తేదీకి వాయిదా పడింది. నేడు శుక్రవారం కూడా వైఎస్ జగన్ కోర్టుకు హాజరు కాలేదు. కోర్టుకు హాజరయ్యే విషయంలో తనకు వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలని కోరుతూ జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

హైకోర్టులో పిటిషన్ పెండింగులో ఉన్నందున తాను కోర్టుకు రాలేనని వైఎస్ జగన్ సీబీఐ కోర్టుకు తెలియజేశారు. దాంతో ఆయన దాఖలు చేసిన ఆబ్సెంట్ పిటిషన్ కు కోర్టు అనుమతి ఇచ్చింది. 

Also Read: వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు: హైకోర్టు తలుపు తట్టిన వైఎస్ జగన్

ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించాల్సి ఉన్నందున తాను కోర్టుకు హాజరు కాలేనని అంటూ అందువల్ల తనకు వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలని కోరుతూ వైఎస్ జగన్ పెట్టుకున్న పిటిషన్ ను గతంలో సీబీఐ కోర్టు తోసిపుచ్చింది. ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పింది.

ఆ నేపథ్యంలో తనకు వ్యక్తిగత మినహాయింపును కోరుతూ వైఎస్ జగన్ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై విచారణ పెండింగులో ఉన్నందున తాను హాజరు కాలేనని అంటూ అందుకు అనుమతించాలని జగన్ సీబీఐ కోర్టును కోరారు. సీబీఐ కోర్టు అందుకు అనుమతించింది.

Also Read: ఆస్తుల కేసులో కోర్టుకు సీఎం జగన్ గైర్హాజర్: అబ్సెంట్ పిటిషన్ దాఖలు