కరోనా వ్యాక్సిన్ తీసుకొన్న అంగన్ వాడీ కార్యకర్తకు అస్వస్థత: నిమ్స్ కు తరలింపు
వరంగల్ లో కరోనా వ్యాక్సిన్ తీసుకొన్న అంగన్ వాడీ కార్యకర్త జ్యోతి అస్వస్థతకు గురైంది. ఆమెను కుటుంబసభ్యులు హైద్రాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
వరంగల్: వరంగల్ లో కరోనా వ్యాక్సిన్ తీసుకొన్న అంగన్ వాడీ కార్యకర్త జ్యోతి అస్వస్థతకు గురైంది. ఆమెను కుటుంబసభ్యులు హైద్రాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. జ్యోతి అస్వస్థతకు కరోనా టీకా కారణమా కాదా అనే విషయం ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది.ఈ విషయమై వైద్యాధికారులు తేల్చనున్నారు.
వరంగల్ జిల్లాలో ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ కారణంగా హెల్త్ వర్కర్ వనిత మరణించిందని కుటుంబసభ్యులు ఆరోపించారు.ఈ విషయమై విచారణకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఆదేశించింది. ఏఈఎఫ్ఐ ఈ ఘటనపై విచారణ నిర్వహిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ నెల 24వ తేదీన ఈ ఘటన చోటు చేసుకొంది.
ఈ ఘటనను మరువక ముందే అంగన్ వాడీ కార్యకర్త జ్యోతి కరోనా వ్యాక్సిన్ తీసుకొన్న తర్వాత అస్వస్థతకు గురైందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకొన్న జ్యోతికి గుండెనొప్పి వచ్చిందని కుటుంబసభ్యులు చెబుతున్నారు.
స్థానికంగా ప్రాథమిక చికిత్స నిర్వహించిన తర్వాత మెరుగైన చికిత్స కోసం ఆమెను నిమ్స్ కు తరలించారు కుటుంబసభ్యులు.జ్యోతి అస్వస్థతకు గురికావడానికి గల కారణాలపై వైద్య శాఖ అన్వేషిస్తోంది.